ఒక్క దెబ్బకు అనేక పిట్టలు కొడుతున్న కేసిఆర్

 

ఈ రోజు నుండి తెలంగాణా వ్యాప్తంగా తెరాస తన కార్యకర్తలకు రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంబించనుంది. నేటి నుండి వచ్చే నెల రెండవ వారం వరకు ఇవి జరుగుతాయి. వీటి ప్రదానోదేశ్యం రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఎలా? మరియు సీమాంద్రా పార్టీలయిన తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను తెలంగాణా ప్రాంతం నుండి బయటకి పంపడం ఎలా? అనే రెండు అంశాలపై పార్టీ కార్యకర్తలకు తగిన విధంగా శిక్షణ ఈయడానికేనని ఆ పార్టీ నేత హరీష్ రావు స్వయంగా మీడియాకు తెలియజేసారు.

 

ఇక అనధికార సమాచారం ప్రకారం ఈ రాజకీయ శిక్షణ తరగతుల ఆలోచన చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఈ కార్యక్రమానికి ఎవరయితే 10వేల మంది తక్కువ గాకుండా కార్యకర్తలను సమీకరిస్తారో వారినే ఆయా నియోజక వర్గ అభ్యర్ధులుగా ప్రకటిస్తానని హామీ ఇవ్వడంతో, రాబోయే ఎన్నికలలో పోటీ చేయలాని ఉవ్విళ్ళూరుతున్న అభ్యర్ధులు కేసీఆర్ పెట్టిన ఈ పరీక్షలో నెగ్గి, టికెట్ గెలుచుకోవాలని హుషారుగా కార్యకర్తల సమీకరణ మొదలుపెట్టారు.

 

ఇక కేసీఆర్ ఈ ఆలోచన చేయడం వెనుక మరొక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, 10వేల మంది కార్యకర్తలని తరలించేందుకు, వారికి భోజన,వసతి సౌకర్యాలు కల్పించేందుకు కనీసం ఒక్కో అభ్యర్ధికి దాదాపు రూ.10 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. ఇంత భారీ ఖర్చుకి సిద్దపడిన అభ్యర్ధులే పోటీలో మిగులుతారు గనుక, ఈవిధంగా కొంత మందిని వడకట్టవచ్చునని ఆయన ఆలోచన. అంతే కాకుండా అభ్యర్ధులు ఆర్ధికంగా బలంగా ఉన్నారో లేదో కూడా ఈ పరీక్షలో తేలిపోతుంది.

 

ఇక కేసీఆర్ మాటని నమ్ముకొని ఇంత శ్రమపడి, ఇంత భారీ మొత్తం ఖర్చుచేసిన తరువాత తమకి టికెట్ వస్తుందని నమ్మకం లేని వారు కూడా ఈ ప్రక్రియలో వడకట్టబడతారు. ఒకవైపు అభ్యర్ధులకు టికెట్ ఆశ చూపుతూ, మరో వైపు వారికి పరీక్ష కూడా పెడుతూ, పార్టీ కార్యకర్తలకి అభ్యర్ధుల ఖర్చులతో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహణ చేయాలనుకోవడం కేసీఆర్ దూర(దురా)లోచనకి ఒక చక్కటి నిదర్శనం.

 

అంతేగాకుండా, ఇటువంటి కార్యక్రమంతో నిర్లిప్తత నెలకొన్న పార్టీ కార్యకర్తలలో మళ్ళీ సమరోత్సాహం కలిగించవచ్చును. అంటే కేసీఆర్ ఒక్క దెబ్బకు అనేక పిట్టలను కొట్టాలని ప్రయత్నిస్తున్నారన్న మాట.