రాష్ట్ర విభజనపై కావూరి పిల్లిమొగ్గలు

 

కావూరి సాంభశివరావు తన చిరకాల వంచ అయిన కేంద్రమంత్రి పదవి రాకపోవడంతో సమైక్యాలాపన కొంచెం గట్టిగానే చేసారు. వీలయితే దానికోసం ఓ స్వంత కుంపటి కూడా పెట్టుకోవడానికి సిద్దం అని తన అనుచరుల ద్వారా సంకేతాలు పంపారు. కానీ మంత్రి పదవి రాగానే, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెపుతూనే, ఎందుకయినా మంచిదని తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం మార్పులేదని ఓ కొసరు డైలాగు కూడా పలికి జాగ్రత్తపడ్డారు. కానీ మంత్రి పదవి రాగానే ‘యు’ టర్న్ తీసుకొన్నారని పత్రికలు, ప్రత్యర్దులు అందరూ విమర్శించినపుడు, “బాధ్యతాయుతమయిన కేంద్రమంత్రి పదవిలోఉన్న నేను ఒక సాధారణ గ్రామ సర్పంచ్ లా మాట్లాడటం మర్యాద కాదు” అని అతి తెలివిగా జవాబిచ్చి తప్పుకొన్నారు.

 

కానీ, మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా అధిష్టానానికి ఎదురు తిరగడంతో, ఇక ఇంత వరకు పదవులు పట్టుకొని వ్రేలాడుతున్న యంపీలు, కేంద్ర మంత్రులు కూడా తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఆయనను అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

 

అందువల్ల నేడు కావూరి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మరో పిల్లి మొగ్గ వేసారు. “నేను ఎప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొనే వాడినే. కానీ కొందరు నేను ‘యు’ టర్న్ తీసుకొన్నానని అనడం నాకు చాలా బాధ కలిగించింది. పదవులకోసమో, డబ్బు కోసమో నేను ప్రలోభపడి మాట మార్చేవాడిని కాను. నేను ఏది మాట్లాడినా శాస్త్రీయంగా, చాలా జాగ్రత్తగా మాట్లాడుతాను. మన రాష్ట్రం ఒక్కటిగా ఉన్నపుడే మనకి 42 యంపీలు ఉంటారు. గనుక దేశంలో మన రాష్ట్రానికి ఒక విలువ ఉంటుంది. కానీ రెండుగా విడిపోయిన తరువాత ఇద్దరూ నష్టపోతాము. ఎనబై మంది యంపీలను కలిగి ఉన్నఅతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కేంద్రంలో ఏవిధంగా చక్రం తిప్పుతోందో మనం చూస్తూనే ఉన్నాము. అంత పెద్ద రాష్ట్రం ఒక్కటిగా మనుగడ సాగిస్తున్నపుడు మనం మాత్రం ఎందుకు విడిపోవాలో నాకు అర్ధం కావడం లేదు. కేవలం కొందరు రాజకీయ నేతలని సంతృప్తి పరచడానికి రాష్ట్రాలు విడగోట్టుకొంటూ పోతే దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడుతాయి. రేపు మన రాష్ట్రం విడిపోతే ఇరువురికీ తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు. అందువల్ల కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించుకొంటే బాగుటుందని నా అభిప్రాయం,” కావూరి బహుశః తను కేంద్ర మంత్రినని మరిచిపోయారో ఏమో, ఒక సాదారణ గ్రామ సర్పంచ్ లా మాట్లాడారు.