కాంగ్రెస్ టైటానిక్ నావ నుండి కావూరి జంప్

 

కేంద్రమంత్రి పదవి కోసం కొల్లేరు సమస్యలను, సమైక్యాంధ్ర నినాదం అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి సైతం వెనుకాడని కావూరి సాంబశివరావు, పదవి వచ్చిన తరువాత ఆ సమస్యల గురించి మరిచిపోయి అధిష్టానం భజన మొదలుపెట్టేసారు. కానీ విభజన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేసరికి సీమాంద్రాలో అకస్మాత్తుగా మారిన రాజకీయ వాతావరణం చూసి, కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెదేపాలో చేరాలని నిశ్చయించుకొన్నాక, చాలా నాటకీయంగా “తనకు దిశా నిర్దేశం చేయమని కోరుతూ తన నియోజక వర్గ ప్రజలకు, తన అనుచరులకు ఆయన ఒక బహిరంగ లేఖ వ్రాసారు. కానీ దానికి ప్రజల నుండి ఎటువంటి స్పందన రాకపోయినా, స్థానిక తెదేపా నేతల నుండి మాత్రం “దయచేసి మీరు మా పార్టీలోకి రావద్దు మహాప్రభో” అంటూ మంచి స్పందన రావడంతో చేసేదేమీలేక కమలం చేతబట్టుకొనేందుకు సిద్దమయిపోయి డిల్లీలో వాలిపోయారు. కానీ బీజేపీ నుండి కూడా ఇంతవరకు ఎటువంటి సానుకూల స్పందన లేకపోయినప్పటికీ, వారిని బలవంతంగా ఒప్పించేసయినా సరే ఆ పార్టీలో చేరిపోవాలని ఫిక్స్ అయిపోయారు.

 

కానీ బీజేపీ-తెదేపాల మధ్య ఎన్నికల పొత్తులు కుదిరి, వారిరువురూ అన్ని సీట్లు సర్దేసుకొన్నాక తను ఎంత పెద్ద ఖర్చీఫ్ పట్టుకొని వెళ్ళినా వేసేందుకు అక్కడ సీటు ఖాళీ ఉండదని, ఇంకా ఆలస్యంచేస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన కావూరి, నెలరోజుల్లో ఊడిపోయే తన కేంద్రమంత్రి పదవిని, మునిపోయే కాంగ్రెస్ పార్టీని కూడా వదిలిపెట్టేసి, పనిలోపనిగా అదే దారిలో ఉన్న బీజేపీ కార్యాలయానికి వెళ్లి కాషాయ కండువా కప్పుకొని వచ్చేద్దామని ఈరోజే డిల్లీ బయలుదేరుతున్నారు. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత బీజేపీలో ఎంట్రీ-టికెట్ దొరక్కపోతే ఏ పార్టీలో చేరాలో చెప్పమని మళ్ళీ ప్రజలకు బహిరంగ లేఖ వ్రాస్తారేమో. అందువల్ల ప్రజలూ.. మీరు కూడా ఆయనకు జవాబిచ్చేందుకు సిద్దంగా ఉండాలి మరి!