కావలి టీడీపీకి కోలుకోలేని దెబ్బ... బీద రవిచంద్రపై నేతల గుర్రు...!

నెల్లూరు జిల్లా కావలిలో అధికార వైసీపీ బలం పెరుగుతూ, ప్రతిపక్ష తెలుగుదేశం బలహీన పడుతోందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు ఒకే పార్టీలో ఉన్న అన్నదమ్ములు బీదా మస్తాన్​రావు, బీదా రవిచంద్రలు, ఇప్పుడు రాజకీయ శత్రువులుగా మారడంతో కావలి రాజకీయాలు రసవత్తరంగా మారాయంటున్నారు. ఎన్నడూ లేనివిధంగా, టీడీపీ అంపశయ్య ఎక్కే పరిస్థితి ఏర్పడిందన్న మాటలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం కావలి నియోజవకర్గంలో తెలుగుదేశానికి అన్నీతానై ఉన్న బీదా మస్తాన్​రావు, టీడీపీని వీడి వైఎస్సార్​కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బీదా మస్తాన్​రావు వెళ్లిపోవడంతో కావలి నియోజకవర్గంలో టీడీపీకి ఎన్నడూలేని విధంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. అసలు, కావలి టీడీపీని ముందుండి నడిపించే నాయకుడు కరువయ్యాడని అంటున్నారు. బీదా మస్తాన్​రావు వైసీపీలో చేరా, టీడీపీలో కిందిస్థాయి నాయకులు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండిపోయారని, అదే వైసీపీకి కలిసొస్తుందని చెబుతున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్​కుమార్​రెడ్డితో సఖ్యతగా ఉంటూనే, బీదా మస్తాన్​రావు తనదైన రాజకీయాలు చేస్తూ, పార్టీలో చక్రం తిప్పుతుండటంతో ఎంతోమంది తెలుగుదేశం అభిమానులు వైసీపీలోకి వెళ్లిపోతున్నారని అంటున్నారు. 

ఒకవైపు బీద మస్తాన్ రావు పార్టీని వీడటంతో కావలి టీడీపీకి తీరని నష్టం జరిగితే... మరోవైపు, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర అనుచిత నిర్ణయాలు పార్టీని దెబ్బతీస్తున్నాయని అంటున్నారు. పార్టీ మారతారన్న సమాచారమున్నా, వాళ్లను బుజ్జగించి టీడీపీలోనే కొనసాగేలా బీదా రవిచంద్ర ప్రయత్నించడం లేదని అంటున్నారు. పైగా, పార్టీ మారతారన్న సమాచారం రాగానే సస్పెండ్ చేసిపారేస్తున్నారని, దాంతో పార్టీకి నష్టం జరుగుతోందని చెబుతున్నారు. కావలి టీడీపీ అధ్యక్షుడు సుబ్బారాయుడుతోపాటు మరో నలుగురు ముఖ్య నేతలు ....ఎమ్మెల్యే రామిరెడ్డి, బీదా మస్తాన్​రావు సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే, వీళ్లు పార్టీ మారతారని ముందే తెలుసుకున్న బీదా రవిచంద్ర... బుజ్జగించాల్సిపోయి, వాళ్ల పదవులను రద్దు చేశారని, ఆ నిర్ణయంతోనే వాళ్లంతా వైసీపీలో చేరారని అంటున్నారు. అలాగే, ఎమ్మెల్యే ఇంట్లోని విందుకు హాజరైన 11మంది టీడీపీ నేతలను సస్పెండ్ చేయడం కూడా పార్టీకి చేటు చేసిందంటున్నారు. ఇలా, అందర్నీ సస్పెండ్ చేసుకుంటూ పోతే, కావలిలో నేతల్లేని పార్టీగా మిగిలిపోయే పరిస్థితి వస్తుందంటున్నారు. 

కావలిలో టీడీపీకి ఇలాంటి పరిస్థితులు దాపురించడానికి కారణం, బీదా రవిచంద్ర తీరేనని, కొందరు బాహాటంగానే విమర్శలు కురిపిస్తున్నారు. కార్యకర్తలు, నేతలకు అందుబాటులో లేకపోవడం, అమరావతిలో ఎక్కువ సమయం గడుపుతుండటంతో, కావలిలో తెలుగుదేశం పార్టీకి గడ్డుకాలం ఏర్పడిందంటున్నారు. ఇప్పటికైనా టీడీపీ అధినాయకత్వం మేల్కొనకపోతే, కావలిలో తెలుగుదేశం అడ్రస్​గల్లంతయ్యే పరిస్థితి వస్తుందంటున్నారు కార్యకర్తలు.