ఖత్రోచీకి భారత్ ఋణపడి ఉండాలిట

 

ఇటలీ దేశానికి చెందిన ఖత్రోచి బోఫోర్స్ కేసులో భారత్ లో చేసిన నిర్వాకం గురించి భారతీయులందరికీ తెలుసు. ఆయన చేసిన నిర్వాకం వల్ల చివరికి మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీపై రూ.80 కోట్లు ముడుపులు స్వీకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తడం, తత్ఫలితంగా ఆయన ఎన్నికలలో ఓడిపోయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. బోఫోర్స్ కేసులో సీబీఐ కేసు నమోదయిన సంగతి పసిగట్టిన వెంటనే రాత్రికి రాత్రి దేశం నుండి ఉడాయించిన ఆ పెద్ద మనిషిమీద రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేయబడింది. రెండు సార్లు పోలీసులనుండి తెలివిగా తప్పించుకొని ఇటలీ చేరుకొన్న అతనిని భారత్ కి తిరిగి రప్పించలేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అతనిపై ఉన్న కేసులన్నీ ఎత్తివేయడం జరిగింది. మన దేశం పరువు తీసిన ఆ మహానుభావుడు నాలుగు రోజుల క్రితం ఇటలీలో గుండెపోటుతో మరణించాడు. బోఫోర్స్ కుంభకోణంలో అసలు సూత్రధారి అయిన అతని మరణంతో ఇక మరెన్నడూ బోఫోర్స్ గురించి ప్రస్తావన కూడా చేయనవసరం లేని పరిస్థితి.

 

ఇంత పెద్ద గ్రంథo నడిపిన ఆ మహానుభావుడు భారత్‌ను ఎంతగానో ప్రేమించారని, ఆయన భారత్ కు చేసిన సేవలకు గాను భారత్ ఆయనకు ఋణపడి ఉండాలని ఆయన కుమారుడు ‘మాసిమో’ మీడియాతో చెప్పడం విశేషం. తన తండ్రిని రాజకీయ వేధింపుల కారణంగానే భోపోర్స్ కుంభకోణంలో ఇరికించారని, నిజానికి ఆయన ఏ పాపం ఎరుగరని అని మాసిమో పేర్కొన్నారు. తన తండ్రి చేసిన పనులకు తానూ చాలా గర్విస్తున్నానని తెలిపారు. పెట్ర ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు అమోఘం అని కొనియాడారు.