బతికున్న వ్యక్తికి పోస్టుమార్టం! వైద్యుల నిర్లక్ష్యం

యాక్సిడెంట్ లో శంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. మూడో రోజూ అతడిలో చలనం లేదు. క్షతగాత్రుడు చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

శంకర్ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష చేయడానికి సిబ్బంది సిద్ధమయ్యారు. కత్తితో డెడ్ బాడీపై గాటు పెట్టబోతుండగా.. శంకర్ చేయి సడెన్ గా కదిలింది. పోస్ట్ మార్టం సిబ్బంది ఒక్కసారిగా బిత్తరపోయారు. అదేంటి? మృతదేహం చేయి కదలడమేంటి? అని షాక్ అయ్యారు. అంతలోనే తేరుకున్నారు. శంకర్ చనిపోలేదని, ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని నిర్ధారించుకున్నారు. వెంటనే అతన్ని మార్చురీ నుంచి ఆసుపత్రి వార్డుకు తరలించారు. ప్రభుత్వ వైద్యులు అతనికి చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు నిర్లక్ష్యంతోనే.. బతికున్న శంకర్ చనిపోయాడని పోస్ట్ మార్టంకు తరలించారని ప్రభుత్వ వైద్యులు మండిపడుతున్నారు. కర్ణాటక, బెల్గావిలో జరిగిన ఈ దారుణంతో.. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకంపై మరోసారి చర్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శంకర్ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆ ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు.