కర్ణాటక సీఎంకు కరోనా.. సెలబ్రెటీలపై సెకండ్ వేవ్ పంజా 

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. పల్లె, పట్నం తేడా లేకుండా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. పేద, ధనిక అనే భేదం లేకుండా అందరని కబళించేస్తోంది. రాజకీయ నేతలు ఎక్కువగా వైరస్ భారీన పడుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులను వదలడం లేదు మాయదారి కరోనా. ఎంతో ఫిట్ గా ఉండే క్రీడాకారులు కూడా కరోనా భారీన పడుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే డాక్టర్లు కూడా కరోనా సోకి హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నారు. 

తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కరోనాకు సోకింది. వైద్య పరీక్షల్లో ఆయనకు మరోసారి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో శుక్రవారం ఉదయం యడ్యూరప్పను  రామయ్య మెమోరియిల్ ఆసుపత్రిలో చేర్చారు. తర్వాత అక్కడి నుంచి మణిపాల్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలియజేసింది. శుక్రవారం  ఉదయం యడియూరప్ప తన నివాసంలో కోవిడ్‌పై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది కూడా యడియూరప్పకు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు.

మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు కోవిడ్-19 పాజిటివ్ నిర్థరణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తాను ప్రస్తుతం ఢిల్లీలోని నివాసంలో క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు. తనను ఇటీవల కలిసినవారు ఐసొలేషన్‌లో ఉండాలని కోరారు. కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని కోరారు దిగ్విజయ్ సింగ్.  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రణదీప్ సుర్జీవాలా తనకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయినట్లు తెలిపారు. గత ఐదు రోజుల్లో తనను కలిసినవారంతా స్వీయ ఏకాంతంలో గడపాలని, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌కు కూడా కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. 

ఇక సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా (68) శుక్రవారం కన్నుమూశారు. కరోనా వల్లే ఆయన మృతి చెందినట్లు సమాచారం. రంజిత్ సిన్హా 1974 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.  అనేక ఉన్నత పదవులను నిర్వహించారు. ఇండో- టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) డీజీగా, సీబీఐ డెరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్‌గా కూడా పనిచేశారు.   

కరోనా సెకండ్ వేవ్ లో వైరస్ భారీన పడ్డారు క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. కొన్ని రోజుల పాటు ఆయన హాస్పిటల్ లో ఉన్నారు. బాలీవుడ్ అగ్రహీరోల్లో చాలా మందికి వైరస్ సోకింది. రాజకీయ నేతల విషయానికి వస్తే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇటీవలే కరోనా భారీన పడ్డారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనాను జయించి డిశ్చార్చ్ అయ్యారు. కొందరు కేంద్రమంత్రులు కరోనాతో హాస్పిటల్ లో  అడ్మిట్ అయ్యారు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి చందులాల్ శుక్రవారం కరోనాతో చనిపోయారు. మహబూబా బాద్ ఎంపీ మాలోతు కవిత, విజయవాడ ఎంపీ కేశినేని నానికి కరోనా నిర్దారణ అయింది.