బీజేపీ కొత్త మిషన్... టార్గెట్ 7 ప్లస్

 

కర్ణాటకలో డిసెంబర్ 5 న జరగనున్న ఉప ఎన్నికలు బిజెపికి కీలకంగా మారాయి. సర్కార్ ను కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల టైం దగ్గరపడుతున్న సమయంలో ఆపరేషన్ 7 ప్లస్ ను ముమ్మరం చేసింది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లోను 15 సీట్లలో 7 కి పైగా సీట్లు గెలుచుకోవాలని చూస్తోంది బీజేపీ. దక్షిణాదిన బీజేపీకి బలం ప్రభుత్వ ఉండేది కేవలం కర్ణాటకలో మాత్రమే అది కూడా ఇప్పుడు మైనారిటీలో ఉంది. ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలపైగా సీట్లు సంపాదిస్తే కానీ సర్కారు నిలబడదు. దీంతో పూర్తిగా మిషన్ 7 ప్లస్ పై ఆధారపడింది బీజేపీ. 

15 నియోజక వర్గాల్లో 8 నియోజకవర్గాలపైన పూర్తిగా దృష్టిని పెట్టింది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేయాలని చూస్తోంది. దీంతో పాటు ప్రత్యర్ధులను తమ దారిలోకి రప్పించి ఈజీగా గెలిచేందుకు ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు బిజెపికి మహారాష్ట్రలో ఎదురు దెబ్బ తగలడంతో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్కారు కొనసాగించాల్సిందేనని అందుకు దేనికి వెనకాడకూడదని రాష్ట్ర నేతలకు ఇప్పటికే జాతీయ నేతలు సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు టైం దగ్గర పడుతుండటంతో యడ్యూరప్ప ప్రచారాలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం కొనసాగుతోందని దీనికి ఎవరి సహకారం అక్కరలేదని హవేరిలో జరిగిన ప్రచారంలో అన్నారు. 15 నియోజకవర్గాల్లోనూ బిజెపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో 14 నెలల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కొనసాగించాయి. పార్టీల మధ్య నెలకొన్న విభేదాలు, రాజీనామాలతో సర్కారు కూలిపోయింది. అయితే అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రస్తుతం మైనారిటీల్లో ఉంది. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన 17 మంది రెబల్స్ ను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య పడిపోయి బీజేపీ బలపరీక్షలో నెగ్గింది. ఖాళీ అయిన స్థానాలకే ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నాడు పరోక్షంగా బిజెపికి సహకరించిన రెబల్స్ ఆ పార్టీలో చేరి ప్రస్తుతం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 15 స్థానాలకు డిసెంబర్ 5 న పోలింగ్ జరగనుంది. అయితే టైం దగ్గరపడుతూండటంతో గెలుపే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతోంది బిజెపి. అయితే ఫలితాలపై నమ్మకం లేకపోవడం వల్లే రాష్ట్రంలో స్పెషల్ ఆపరేషన్లు బిజెపి నిర్వహిస్తోందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.