ఈ దాహం తీరనిది..

 

 

 

కర్నాటక జలదాహం అంత ఈజీగా తీరేట్టు కనిపించడం లేదు. అటు కావేరీ నది విషయంలో తమిళనాడు నోరు కొడుతోంది. ఇటు కృష్ణానది విషయంలో ఆంధ్రప్రదేశ్ గొంతు ఎండేలా చేస్తోంది. అయినా ఇంకా నీళ్ళ కరువు తీరనట్టు వ్యవహరిస్తోంది. తాజాగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో మిగులు జలాల విషయంలో ఆంధ్రకు అన్యాయం. కర్ణాటకకు అపాత్రదానం జరిగిపోయింది.

 

ఈ విషయంలో తప్పు ఎవరిదన్న విషయంలో వివిధ రాజకీయ పార్టీలు ఒకరిమీద ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నప్పటికీ మొత్తమ్మీద తెలుగువాడికి అన్యాయం జరిగింది. ఈ విషయంలో కేంద్రంతో తీవ్రంగా పోరాడాల్సిన అవసరం వుంది. రాజకీయాలకు అతీతంగా తెలుగువారందరూ ఒక్కటై ఈ విషయంలో మనకున్న హక్కును సాధించుకోవాల్సిన అవసరం వుంది. బ్రిజేష్ కుమార్ తీర్పు ఇప్పటికే తెలుగు ప్రజల గుండె మండిపోయేలా చేస్తుంటే, కర్నాటక ప్రజలు సంబరాలు చేసుకునేలా చేసింది.



ఇప్పటికే అదనంగా దక్కిన నీటి వాటాతో సంతృప్తి చెందని కర్ణాటక ఇప్పుడు మరో వివాదాన్ని పైకి తీసుకొచ్చింది. నీటి విషయంలో తన కక్కుర్తి బుద్ధిని బయటపెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కి పంపిణీ చేస్తున్న నీటిలో నాలుగు టీఎంసీల నీటి మీద తనకు హక్కు వుందని, ఆ నాలుగు టీఎంసీలను ఆంధ్రకు పంపడం ఆపి వాటిని తనకే కేటాయించాలని కర్ణాటక భావిస్తోంది. దీనికోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. మరి ఈ విషయంలో అయినా తెలుగు ప్రజలు కలసి కట్టుగా పోరాటం చేస్తారో లేక తమలో తాము కలహించుకుంటూ కర్ణాటక ఈ విషయంలోనూ గెలిచేలా చేస్తారో చూడాలి.