జగన్, పవన్ రహస్య సమావేశం.. 40 సీట్లు ఆఫర్‌

 

వైసీపీ అధినేత జగన్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మధ్య రహస్య పొత్తు ఉంది.. వీరిద్దరిని బీజేపీ వెనుక నుంచి నడిపిస్తుందని గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.  అయితే తాజాగా ఏపీ ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్‌ కారెం శివాజీ.. జగన్, పవన్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే విశాఖలోని వట్టి రవి ఇంట్లో జగన్, పవన్ కలిసారని శివాజీ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తాజాగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 'జగన్ విశాఖలో పాదయాత్ర కొనసాగిస్తున్న సమయంలో.. వట్టి రవి నివాసంలో పవన్‌ను జగన్ కలిసి 40 సీట్లు ఆఫర్‌ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అప్పటికే సీఎం సీటుపై దృష్టి పెట్టి ఉండటంతో ఆ సీట్లకు ఆయన ఒప్పుకోలేదు. అలా ఆ చర్చల్లో సీట్లు సర్దుబాటు కాక వీరి పొత్తు పొడవలేదు' అని శివాజీ అన్నారు.

జగన్,పవన్ వీరిద్దరూ ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఆడుతూ ఏపీ ప్రజలను మోసగించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారని శివాజీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏపీని నమ్మించి దగా చేసిందన్నారు. అధికారంలోకి వస్తే విభజన హామీలను నెరవేర్చి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పడం వల్లే రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారని అన్నారు. బీజేపీతో సహా ప్రతిపక్షాలు ఆ కూటమిని చూసి భయంతో, ఓర్వలేనితనంతో కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేసారు.