అమరావతిని మార్చడం జగన్ తరంకాదు... రంగంలోకి దిగిన బీజేపీ...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. సంక్రాంతికి ముందు జరిగిన ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రాజధాని తరలింపును అడ్డుకుంటామంటూ తీర్మానం చేయగా, ఇక ఇప్పుడు అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చనివ్వబోమంటూ తేల్చిచెప్పింది. అసెంబ్లీ బలముంది కదా అని ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటానంటే ఊరుబోమని జగన్ ప్రభుత్వాన్ని ఏపీ బీజేపీ హెచ్చరించింది. ఏపీ రాజధానిగా ఆనాడు అసెంబ్లీ లోపలా బయటా అమరావతిని ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి... ఇఫ్పుడు మారుస్తానంటే ఎలా కుదురుతుందన్నారు. ఒకవేళ జగన్ ఏకపక్షంగా ముందుకెళ్తే వైసీపీ ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని ఏపీ బీజేపీ నేతలు అల్టిమేటం ఇచ్చారు. 

ఏపీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకోకుండా నియంత మాదిరిగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటానంటే కుదరదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అమరావతిని ఎట్టిపరిస్థితుల్లోనూ కదలనివ్వబోమని తేల్చిచెప్పిన కన్నా... జనసేనతో కలిసి ఉమ్మడి పోరాటాలు చేస్తామని తెలిపారు. పీపీఏలు, పోలవరం అంశాల్లో జగన్ అనుకున్నట్లు జరగలేదని, ఇఫ్పుడు రాజధాని విషయంలోనూ అదే జరుగుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అసెంబ్లీ 151 సీట్ల బలముందని...ఏమైనా చేస్తానంటే ప్రజాస్వామ్యంలో కుదరంటూ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అమరావతి విషయంలో ప్రజాపోరాటాలు చేస్తామని, అవసరమైతే న్యాయపరంగా కూడా ముందుకెళ్తామన్నారు. ఏదిఏమైనాసరే వైసీపీ పాలకులు అమరావతిని మాత్రం కదల్చలేరని తేల్చిచెకప్పారు. 

కుటుంబ జోక్యం, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలతో జగన్ ప్రభుత్వం ప్రజల్లో చులకనైపోతోందని ఏపీ బీజేపీ నేతలు అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి-స్వర్గం చూపిస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి... కుటుంబం, కులానికి ప్రాధాన్యతనిస్తూ... అవినీతి అరాచకాలతో పాలన సాగిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. అలాగే, ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి పెట్టుబడి పెట్టినవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, అయితే... వైసీపీ పెట్టుబడిదారుల బారిన రాష్ట్రం పడకుండా అడ్డుకుంటామని ఏపీ బీజేపీ నేతలు ప్రకటించారు. ఏపీ బీజేపీ ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ కూడా జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ఏపీకి కులం, కుటుంబం, అవినీతి, అరాచకమనే గ్రహణాలు పట్టాయని.... వాటిని జాతీయవాదం, ప్రజాసంక్షేమమనే ఆయుధాలతో ఓడిస్తామన్నారు.