కవిత కొండంత అండ.. నిజామాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్న కవిత

2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధిగా పోటి పడి ఓటమి చవి చూసిన కవిత యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో నిజామాబాద్ రాజకీయాల్లో ఆమె మళ్లీ యాక్టివ్ అవ్వనున్నారా అనే అంశంపై టీఆర్ఎస్ పార్టీలో.. రాజకీయ వర్గాల్లో.. చర్చ జరుగుతోంది. గత ఏడాది మే నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించిన ఆమె మళ్లీ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి కవిత అంశమే టీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. నిజామాబాద్ జిల్లాలో ఏడు మునిసిపాల్టీలు, ఒక కార్పొరేషన్ లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నిజామాబాద్ కార్పొరేషన్ గెలవడం అధికార టీఆర్ఎస్ పార్టీకి కత్తిమీద సాములా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

ఒక వైపు నిజామాబాద్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ కి బిజెపి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులున్నాయని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ సీటును కోల్పోయినట్లే కార్పొరేషన్ ను కూడా కోల్పోతే భవిష్యత్తులో తమ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్న ఆందోళన గులాబి దళంలో వ్యక్తమవుతోంది. ఆ జిల్లాలో సీనియర్ నేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంతరెడ్డి ఉన్నప్పటికీ మాజీ ఎంపీ కవితను రంగంలోకి దిగితేనే బాగుంటుందనే వాదనను ఆ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు గట్టిగా వినిపిస్తున్నారని సమాచారం. నిజానికి గత ఏడాదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల వరకు నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ కార్యకలపాలను కవిత అన్ని తానే నడిపారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రావడంతో మళ్లీ ఆమె క్రియాశీలకంగా వ్యవహరించాలని నేతలంతా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. మున్సిపోల్స్ లో కవిత యాక్టివ్ రోల్ పోషిస్తే క్యాడర్లలో కూడా నూతన ఉత్సాహం ఉంటుందని.. తమకు అండగా కవిత నిలిస్తే కొండంత ధైర్యం వస్తుందని ఆ జిల్లా నేతలు ఆశిస్తున్నారు. అయితే వారితో కల్వకుంట్ల కవిత నిత్యం మాట్లాడుతూనే ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను ఆమె తీసుకుంటారా లేదా అనేది ప్రశ్నగా మారింది. ప్రస్తుతం కవితకు ఏ పదవి లేకపోవటం కూడా ఆమెకు ఇబ్బందిగా మారిందని.. అందువల్ల ఆమె ఆ జిల్లాలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వెనకాడుతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరి నేతలు కార్యకర్తల అభీష్టం మేరకు మున్సిపల్ ఎన్నికల్లో కవిత ప్రచారం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.