అటెండరే టెండరు పెట్టాడు

 

వరంగల్ జిల్లా భూపాలపల్లి కాకతీయ గ్రామీణ బ్యాంక్‌లో ఐదు రోజుల క్రితం భారీ చోరీ జరిగింది. అయితే బ్యాంకు దొంగతనం చేసిన దొంగలు దొంగిలించిన సొత్తు మొత్తాన్నీ ఓ బ్యాగ్‌లో వుంచి అంబట్‌పల్లిలోని ఓ కిరాణా దుకాణం వద్ద ఆ బ్యాగ్‌ని వదిలేసి వెళ్ళిపోయారు. పోలీసులు అక్కడి నుంచి 36 కిలోల బంగారం, 26 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ దోపిడికి పాల్పడిన వాళ్ళు ఒక సుమో వాహనంలో సొమ్మును తరలించారని తెలుస్తోంది. అయితే వాళ్ళు ఈ సొత్తంతా కిరాషా షాపు దగ్గర ఎందుకు వదిలి వెళ్ళారో అర్థం కావడం లేదు. ఈ స్టోరీలో ఇంకో ట్విస్ట్ ఏమిటంటే, బ్యాంకు నుంచి 43 లక్షల నగదు, 33 కిలోల బంగారం పోయిందని బ్యాంకు అధికారులు చెప్పారు. అయితే తిరిగి దొరికింది మాత్రం 26 లక్షల నగదు. 46 కిలోల బంగారం. డబ్బు తగ్గిందంటే దొంగలు కొంత డబ్బు తీసుకుని వెళ్ళారని అనుకోవచ్చు. మరి బంగారం ఎందుకు పెరిగిందనే సందేహాలు వస్తున్నాయి. బ్యాంకు అధికారులు సరిగా సమాచారం ఇవ్వలేదా అనే అనుమానం కూడా కలుగుతోంది. బంగారం ఎక్కడైతే దొరికిందో ఆ కిరాణా షాపు యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ బ్యాంకు దొంగతనానికి కీలక సూత్రధారి ఆ బ్యాంకులో అటెండర్‌గా పనిచేసే వ్యక్తి అని పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడీ జరిగిన రోజు నుంచి అటెంటర్ కనిపించడం లేదు.