ఎన్నికల్లో పోటీకి కూడా నిలబడరేమో: కడియం శ్రీహరి

 

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడటంతో పార్టీలు అభ్యర్థుల ప్రకటన, ప్రచారం, మేనిఫెస్టోలతో బిజీ బిజీ అయిపోయాయి. కాంగ్రెస్ ఓవైపు మహాకూటమిలో సీట్ల సర్దుబాటు గురించి చర్చిస్తూనే.. మరోవైపు ప్రచారం మొదలు పెట్టింది. అలాగే పలు హామీలను ప్రకటించింది. ఇక తెరాస విషయానికొస్తే.. అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే 105 మంది అభ్యర్థులను ప్రకటించింది. ప్రచారంలో దూసుకుపోతుంది. తాజాగా పాక్షిక మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. అయితే ఈ మేనిఫెస్టోపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ హామీలను తెరాస కాపీ కొట్టిందంటూ ఆరోపించారు. దీనికి తెరాస నేతలు కూడా కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇలా తెరాస పాక్షిక మేనిఫెస్టో గురించి కాంగ్రెస్, తెరాసల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయితే తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించారు.

తెరాస ప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు దేశంలోనే మంచి పేరుందని అన్నారు. తెరాస హామీ ఇస్తే అమలు చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని.. అందుకే తమ పార్టీ పాక్షిక మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల్లో తమకు మంచి స్పందన రావడాన్ని ఓర్వలేక ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతున్నాయని కడియం ఆరోపించారు.

ఇప్పటి వరకు తాము ప్రకటించింది పాక్షిక మేనిఫెస్టో మాత్రమేనని.. పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తే ఎన్నికల్లో పోటీకి కూడా నిలబడరేమోనని కడియం ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని పలు సంస్థలు, వ్యక్తుల నుంచి వచ్చే సలహాలు, సూచనలతో నవంబర్‌ మొదటి వారంలో పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలకు రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే తమ మేనిఫెస్టోను చూసి ప్రజలు మెచ్చుకునేలా వాళ్లూ ప్రకటించవచ్చన్నారు. అంతేకానీ దివాలాకోరు మాటలతో ప్రయోజం లేదని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. మేనిఫెస్టో ప్రకటించుకునేందుకు సమయం ఉన్నప్పుడు తమ మేనిఫెస్టోను చూసి ఎందుకు భయపడుతున్నారని కడియం ప్రశ్నించారు.