కడియంపై రఘునందన్ రావు హత్యారోపణలు

 

ఇటీవల తెరాస నుండి సస్పెండయిన రఘునందన్ రావు, తెదేపా నాయకుడు కడియం శ్రీహరిపై పరశురాం అనే వ్యక్తి హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయని, ఏళ్లతరబడి పార్టీ జెండామోసిన తనను పార్టీనుండి సస్పెండ్ చేసి అటువంటి వ్యక్తిని తెరాసలోకి చేర్చుకోవడం ఏవిధంగా సమంజసమని ప్రశ్నించారు. రఘునందన్ రావు ఆరోపణలకు కడియం శ్రీహరి స్పందిస్తూ తనను వ్యతిరేఖించే పార్టీ నేతలు కూడా ఎన్నడూ తనపై ఇటువంటి నీచమయిన ఆరోపణలు చేయలేదని, పార్టీ నుండి సస్పెండ్ అయిన రఘునందన్ రావు ఇటువంటి ఆరోపణలు చేయడం చాలా విచారకరమని, ఆయన తన ఉనికిని కాపాడుకొనేందుకే ఇటువంటి చవకబారు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తానూ మొదటి నుండి విలువలతో కూడిన రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చానని, భూ వివాదాలు, వసూళ్ళు, హత్యా రాజకీయాలకు తానూ ఎప్పుడూ దూరంగానే ఉంటున్నాని ఆయన అన్నారు. తనపై ఆయన చేసిన హత్యారోపణలపై 48గంటలలో ఆయన రుజువులు చూపాలని లేకుంటే ఏ మీడియా ముందు ఇటువంటి ఆరోపణలు చేసారో అదే మీడియా ముందు నిలబడి తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన హెచ్చరించారు. లేకుంటే, ఆయనపై తానూ కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించారు. అయితే, ఇంత వరకు రఘునందన్ రావు ఆయన సవాలుకు స్పందించలేదు.