దమ్ముంటే ‘అఖిలం’ మినిట్స్ తెప్పించు :కడియం సవాల్

 

 

 

 

 

గత నెలలో ఢిల్లీ లో జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా విషయంలో స్పష్టత ఇవ్వలేదని కేసిఆర్ చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని తెలుగు దేశం పార్టీ నేత కడియం శ్రీహరి సవాల్ చేశారు. తమ పార్టీ వైఖరి తెలంగాణా కు అనుకూలం కాదని నిరూపిస్తే, తాను ఏ శిక్షకైనా సిద్దమని, అలా చేయలేని పక్షంలో కేసిఆర్ తగిన శిక్షకు సిద్దమా అని కడియం ప్రశ్నించారు.

 

అఖిల పక్ష సమవేశంలో జరిగిన దానికి తమ పార్టీ ప్రతినిధిగా వెళ్ళిన తాను సాక్షినని, దానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కేసిఆర్ ఇలా మాట్లాడటం ఏమిటని ఆయన అన్నారు. ఆయనకు దమ్ముంటే, ఆ సమావేశం మినిట్స్ తెప్పించవచ్చని కడియం సవాల్ విసిరారు. అప్పుడు తమ పార్టీది స్పష్టతో, కాదో తెలిసిపోతుందని కడియం వ్యాఖ్యానించారు.

 

ఆ సమావేశం నుండి బయటకు వచ్చిన తర్వాత తమ పార్టీ స్పష్టమైన వైఖరితో వచ్చి మాట్లాడిందని అన్ని పార్టీలు తమను ప్రశంసించాయని, అయినా కేసిఆర్ తమఫై ప్రత్యెక రాష్ట్రం విషయంలో ఎందుకు విమర్శిస్తున్నాడో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. టిడిపి తెలంగాణాకు అనుకూలమని షిండే బహిరంగంగా అన్న మాటలు కేసిఆర్ వినలేదా అని కడియం ప్రశ్నించారు.