తెరాసతో సమరానికి టీ-కాంగ్రెస్ సై

 

కొద్ది రోజుల క్రితం తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోమని కుండ బ్రద్దలు కొట్టారు. అయితే, పొత్తులు ఉండవని చెప్పకుండా కమిటీయే చూసుకొంటుందని తెలివిగా తప్పుకొన్నారు. తాము పొత్తులకు అంగీకరించినా టీ-కాంగ్రెస్ నేతలు ఎలాగు అంగీకరించరని కేసీఆర్ ముందే ఊహించారు. వారికి దక్కవలసిన టికెట్స్, మంత్రి పదవులు అన్నీ తామే ఎగురేసుకొని వేల్లిపోతామనే భయంతో వారే పొత్తులు వద్దని తమ అధీష్టానానికి చెప్పుకొంటారని కేసీఆర్ ఊహించారు. అందుకే తెలివిగా పొత్తులు లేవని చెప్పకుండా బంతి కాంగ్రెస్ కోర్టులో పడేసారు. ఆయన ఊహించినట్లుగానే ఈరోజు మాజీ మంత్రి జానా రెడ్డి ఇంట్లో సమావేశమయిన టీ-కాంగ్రెస్ నేతలు తెరాసతో పొత్తులు తమకు అవసరం లేదని, తాము ఒంటరిగానే పోరాడి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలమని ప్రకటించారు.

 

జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం ఇచ్చిన ఖ్యాతి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అయితే ఇతర పార్టీలు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నదున వాటి పాత్రా ఉందని మేము అంగీకరిస్తున్నాము. కానీ, ఇతర పార్టీలు ఎంత పోరాటం చేసినాకూడా కాంగ్రెస్ ఇవ్వదలచుకోకపోతే తెలంగాణా ఏర్పడేదే కాదని అందరికీ తెలుసు. కనుక ప్రధానంగా ఈ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. తెలంగాణా ఇచ్చినందుకు కృతజ్ఞతగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తారని మేము నమ్ముతున్నాము. అందువల్ల మాకు ఎవరి మద్దతు, పొత్తులు అవసరం లేదు. మా అంతట మేమే మా పార్టీని పూర్తి మెజార్టీతో గెలిపించుకొని తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వం మేమే ఏర్పాటు చేస్తాము. తెలంగాణా పునర్నిర్మాణం ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది తప్ప ప్రాంతీయ పార్టీల వల్ల కాదు."

 

"ఒకవేళ మా అధిష్టానం కేంద్ర రాజకీయ అవసరాల నిమిత్తం ఎవరితోనయినా ఎన్నికల పొత్తులు పెట్టుకోదలిస్తే మేము ఎటువంటి అభ్యంతరమూ చెప్పము. అందుకు తప్పకుండా సహకరిస్తాము," అని తెలిపారు.