అల్లర్ల కేసు విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి బదిలీ.. సాధారణ ప్రక్రియలోభాగమేనన్న కేంద్రం

ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీధర్ ను కేంద్రం రాత్రికి రాత్రే పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చేసిన విద్వేష ప్రచారం వల్లే అల్లర్లు చోటుచేసుకున్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రసంగాల సందర్భంగా పక్కనే ఉన్న పోలీసు అధికారులు తమ బాధ్యత నిర్వర్తించలేదంటూ మురళీధర్ చేసిన వ్యాఖ్యలు కేంద్రానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో రాత్రికి రాత్రే ఆయన్న పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. జస్టిస్ మురళీధర్ బదిలీ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కీలక కేసు విచారణ జరుపుతున్న న్యాయమూర్తిని అర్ధరాత్రి బదిలీ చేయడం సరికాదని కేంద్రంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

దీంతో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విపక్షాల విమర్శలపై స్పందించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు జస్టిస్ మురళీధర్ ను బదిలీ చేశామని తెలిపారు. ఇదంతా సాధారణ ప్రక్రియలో భాగమేనన్నారు. సాధారణంగా ఇలాంటి బదిలీలు చేసినప్పుడు కొత్త స్దానంలో బాధ్యతలు చేపట్టేందుకు రెండు వారాల సమయం కూడా ఉంటుందన్నారు. జడ్జి బదిలీ వ్యవహారాన్ని విపక్ష కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం సరికాదని రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు.