ఎన్టీఆర్ ‘టెంపర్’ తగ్గించుకోవాలి

 

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమా ఆడియో బుధవారం నాడు విడుదలైంది. సినిమా కూడా ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బాగా ‘టెంపర్’ ఉన్న పాత్రలో నటించాడని టైటిల్ చెబుతోంది. కాస్తంత సినిమా నాలెడ్జ్‌తో ఆలోచిస్తే, ఈ సినిమాలో హీరోకి బోలెడంత టెంపర్ వుంటుంది. హీరో టెంపర్ ధాటికి అందరూ అతనికి భయపడిపోతూ వుంటాడు. చివరికి ఆ టెంపర్‌తోనే హీరో సక్సెస్ అవుతాడు... స్క్రీన్ ప్లే రకరకాలుగా వుండచ్చుగానీ, బేసిక్ కథ మాత్రం ఇలాగే వుంటుంది. బాగా టెంపర్ వున్న హీరో సక్సెస్ కావడం సినిమాల్లో జరుగుతుందేమోగానీ, నిజ జీవితంలో మాత్రం అలా జరగదు. టెంపర్ బాగా ఎక్కువైతే పంచర్ పడుతుంది. దీనికి ఉదాహరణ కావాలంటే వేరే ఎక్కడికో వెళ్ళడం ఎందుకు... మన జూనియర్ ఎన్టీఆరే దీనికి పెద్ద ఉదాహరణ. నిజ జీవితంలో తనకున్న టెంపర్‌ పుణ్యమా జూనియర్‌ ఎన్టీఆర్‌కి బోలెడన్ని పంచర్లు పడ్డాయి. పాపం ఇప్పుడు ఆయన ఆ పంచర్లకు ప్యాచీలు వేసుకునే పనిలో వున్నారు.

 

ఒకప్పుడు సూపర్ సక్సెస్‌ఫుల్ హీరోగా వున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా డల్లయిపోవడానికి ప్రధాన కారణం ఆయనకున్న టెంపరే. ఆ టెంపర్‌తోనే పెట్టుకోక పెట్టుకోక వాళ్ళతో వీళ్ళతో కాకుండా డైరెక్ట్‌గా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితోనే పెట్టుకున్నాడు. ఎవరి మాటలు విని పాడైపోయాడోగానీ, మొన్నటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ప్రచారానికి రావయ్యా మగడా అని తెలుగుదేశం వర్గాలు ఎంత రిక్వెస్ట్ చేసినా టెంపర్ చూపించి బెట్టు చేశాడు. తనకు అర్హతలేని స్థాయిని పార్టీలో ఆశించి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేశాడు. తాను ప్రచారం చేయకపోతే తెలుగుదేశం పార్టీ కష్టాలపాలైపోతుందన్న భ్రమలేవో పెట్టుకున్న ఆయన పోజులు కొట్టాడు. చివరికి ఏమైంది.. ఈయనగారు ప్రచారం చేయకపోయినా తెలుగుదేశం విజయం సొంతం చేసుకుంది. టెంపర్ చూపించిన జూనియరే ఆ తర్వాత కష్టాల్లో పడిపోయాడు.

 

జూనియర్‌కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందంటే దానికి ప్రధాన కారణం అన్న నందమూరి తారక రామారావు మనవడు కావడంతోపాటు తెలుగుదేశం పార్టీ కూడా ఆయన వెంట వుండటం వల్లే. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయకుండా కీలక సమయంలో పార్టీకి హ్యాండ్ ఇవ్వడంతో అన్న ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆయన్ని తమ మనసుల్లోంచి చెరిపేశాయి. ఆయన్ని ఎవరో పరాయి వ్యక్తిగా చూడ్డం మొదలుపెట్టాయి. చివరికి ఆయన సినిమాలు చూడ్డంగానీ, ఆయన సినిమాల ప్రమోషన్‌కి కష్టపడ్డంగానీ మానేశారు. దాంతో ఏమైంది... ఆయన సినిమాలు వరుసగా ఢమాల్ అయిపోవడం మొదలుపెట్టాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలైతే జిందాబాద్‌లు కొట్టే ఫ్యాన్సే లేకుండా పోయారు.

 

సినిమాల పరిస్థితి ఇలా వుంటే, రాజకీయంగా కూడా జూనియర్ పరిస్థితి జీరో అయిపోయింది. పార్టీలో ఆమధ్య చంద్రబాబు తర్వాత నేనే అన్నట్టుగా వుండే ఆయన పార్టీకి దూరమయ్యేసరికి చంద్రబాబు మెల్లగా లోకేష్‌ని తెరమీదకి తెచ్చారు. లోకేష్ తన సిన్సియారిటీతో, శ్రమించే తత్వంతో కార్యకర్తలకు బాగా చేరువయ్యారు. ఆయన చెప్పుకోకపోయినా పార్టీలో నంబర్ టూ స్థానంలో వున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లేనిపోని టెంపర్ చూపించకుండా వుంటే నిజానికి ఆయన పార్టీలో ఇప్పుడు లోకేష్‌కి ఉన్నంత ప్రాధాన్యత పొందేవారు. తన టెంపర్ కారణంగా ఇంటికూటికి బంతికూటికి చెడ్డట్టుగా ఆయన పరిస్థితి తయరైంది.

 

సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ తన టెంపర్ తగ్గించుకుంటే బాగుంటుందని అన్న ఎన్టీఆర్‌ని అభిమానించే వారు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చేరువగా వుండి, పార్టీకి ఉపయోగపడి, తన కెరీర్‌నీ చక్కదిద్దుకోవాలని సూచిస్తున్నారు. అలా కాకుండా నేనింతే... టెంపర్ ఇంతే అని అంటే ఇక అంతే సంగతులని అంటున్నారు. ‘టెంపర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు... ‘‘దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర’’ అని... తన టెంపర్ తగ్గించుకోకపోతే జూనియర్ ఎన్టీఆర్ కనీసం సినిమాల్లో కూడా విజయాలు లేక విజయం కోసం గజనీ, ఘోరీలాగా దండయాత్రలు చేయాల్సిందేనని అంటున్నారు.