వన్ మ్యాన్ ఆర్మీగా కిరణ్ పార్టీ

 

సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీ, దానికి కొత్తగా పుట్టుకొచ్చిన మరో కొమ్మ జైసమైక్యాంద్ర పార్టీల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయిన వారిని లెక్కపెట్టడం కంటే ఇంకా పార్టీలో ఎంతమంది మిగిలున్నారని చూసుకోవడమే తేలికగా ఉందిపుడు. ఇక నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఒకవెలుగు వెలిగిన కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. ఆయన పార్టీ పెట్టక ముందే కొంతమంది జారిపోతే, పెట్టాక మిగిలిన వారు కూడా జారిపోతున్నారు. మొన్నటి వరకు ఆయన కనుసన్నలలో నడుచుకొన్న ఏపీ యన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు కూడా సైకిలెక్కి చంద్రబాబుతో ఎన్నికల షికారు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. చంద్రబాబు ఒక అడుగు ముందుకేస్తే, తాము రెండడుగులు ముందుకేసి సహకరిస్తామని చెప్పడం గమనిస్తే, ఆయన కూడా తేదేపాకు మద్దతు పలకడం ఇక లాంచనప్రాయమేనని స్పష్టమవుతోంది. ఒకవేళ చంద్రబాబు ఆయనకు కూడా పార్టీ టికెట్ ఇచ్చేందుకు అంగీకరిస్తే, ఆయన నేరుగా తెదేపాలో జేరిపోతారేమో కూడా.

 

ఇక మాజీ మంత్రి పితాని, సాయి ప్రతాప్, శైలజానాథ్ వంటి వారు కూడా వీలువెంబడి తెదేపాలో దూకేసేందుకు సిద్దంగా ఉన్నారు. నేటికీ కిరణ్ వెంట ఉన్న ఉండవల్లి, హర్ష కుమార్ వంటి మంచి బలమయిన నేతలైనా తమ జైసమైక్యంధ్ర పార్టీ తరపున మాట్లాడక పోవడంతో, జైసపా పరిస్థితి “వన్ మ్యాన్ ఆర్మీ-వన్ మ్యాన్ షో” అన్నట్లు తయారయింది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే పార్టీ బాధ్యత నెత్తికెత్తుకొని పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రజలు స్పందించడం లేదు. ఆయన నిర్వహిస్తున్న రోడ్ షోలకు జనాలను సమీకరించడం కూడా చాలా కష్టమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన భవిష్యత్తు, ఆయన పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారవచ్చును. సరయిన సమయంలో సరయిన నిర్ణయం తీసుకోకపోతే అది ఏవిధంగా ‘రియాక్షన్’ చూపిస్తుందో కిరణ్ కుమార్ రెడ్డిని చూస్తే అర్ధమవుతుంది.