జూనియర్ యన్టీఆర్ బీజేపీలోకి జంప్?

 

ఇటీవల తెదేపాలో చేరిన గల్లా జయదేవ్ తన బావమరిది మహేష్ బాబు తన కోసం (పార్టీ కోసం) ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మహేష్ బాబుతో బాటు ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తదితరులు కూడా తెదేపా ప్రచారం కోసం తరలిరావడం ఖాయమనేసుకోవచ్చును.

 

అయితే ఇంతవరకు తేదేపాకు స్టార్ ఎట్రాక్షన్ గా నిలచిన జూ.యన్టీఆర్ పరిస్థితి ఏమిటనే ధర్మసందేహం అందరికీ కలగడం సహజం. జూ.యన్టీఆర్ మరియు అతని తండ్రి హరికృష్ణ చాలా కాలంగా తెదేపాకు దూరంగానే ఉన్నారనే సంగతి, అందుకు కారణాలు వగైరా అందరికీ తెలిసిన సంగతే. అదేవిధంగా చంద్రబాబు, బాలకృష్ణలు కూడా వారిరువురితో అంటీ ముట్టనట్లే ఉంటున్నారు. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో మళ్ళీ తనకు టికెట్ కావాలని హరికృష్ణ అడిగినప్పటికీ చంద్రబాబు ఆయన అభ్యర్ధనను పట్టించుకోకపోవడంతో ఆయన సమావేశం మధ్యలోనే అలిగి బయటకు వెళ్ళిపోయారు. ఈ నేపధ్యంలో గల్లా జయదేవ్ కోసం మహేష్ బాబు వంటి పెద్ద స్టార్ ప్రచారానికి వస్తున్నపుడు ఇక వారిని చంద్రబాబు పట్టించుకొంటారా? అనే అనుమానం కలుగక మానదు. ఇంతజరిగిన తరువాత ఒకవేళ ఆయన పిలిచినా వారిరువురూ వస్తారా లేదా? అనేది కూడా అనుమానమే.

 

ఒకవేళ వారి మధ్య ఈ దూరం ఇలాగే ఉండిపోతే, ప్రతిపక్ష పార్టీలు వారిరువురికీ ఆహ్వానాలు పంపితే వారు వెళ్ళకుండా ఉంటారా? ఇప్పుడు స్వయాన హరికృష్ణ సోదరి పురందేశ్వరి బీజేపీలో చేరారు గనుక, ఒకవేళ ఆమె ఆహ్వానిస్తే హరికృష్ణ, జూ.యన్టీఆర్ ఇరువురూ కూడా బీజేపీలోకి వెళ్ళినా వెళ్ళవచ్చును. కానీ, తెదేపా-బీజేపీలు గనుక ఎన్నికలు పొత్తులు పెట్టుకోన్నట్లయితే మళ్ళీ నందమూరి కుటుంబ సభ్యులు అందరూ పాత (యన్టీఆర్) సినిమాలలోగా గ్రూప్ ఫోటోకి కలుస్తారేమో!