జూనియర్ కు జగన్ పిలుపు!!

 

ఏపీకి ఆదాయాన్ని అందించే ఏ అవకాశాన్నీ వదులుకోరాదని తన కేబినెట్‌లో ఉన్న మంత్రులందరికీ సీఎం జగన్ స్పష్టం చేసారు. దీంతో రాష్ట్రంలోని వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటకం సహా అన్ని రంగాలకు బ్రాండ్ అంబాసీడర్‌లను నియమించాలని ముఖ్యమంత్రికి కొందరు సలహా ఇచ్చారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏదైనా ఒక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్‌ను నియమించాలని పలువురు సూచించారని సమాచారం. 

అయితే జూనియర్ ఎన్టీఆర్ ను సంప్రదించడం ఎలా అని తర్జనభర్జన పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అడిగినా జూనియర్ ఒప్పుకుంటాడా అన్న దానిపైనా పార్టీ అంతర్గత సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రభుత్వానికి ఎటువంటి సహకారం అందించని తారక్ టీడీపీని ఓడించిన వైస్సార్సీపీకి మద్దతు ప్రకటిస్తారా? అంటే అనుమానమే. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కి ఎంతో ఆప్తుడైన ఏపీ మంత్రి కొడాలి నాని, జూనియర్ కి పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాస్ లకు జూనియర్ ని ఒప్పించే బాధ్యత అప్పగించాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

తన తాత పెట్టిన పార్టీని అధికారంలోకి తీసుకు రావాలన్న ఉద్దేశ్యంతో 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఖాకీ వస్త్రాలు ధరించి, చైతన్య రథంపై నలుమూలలా తిరుగుతూ తన తాత నందమూరి తారక రామారావును గుర్తు చేశాడు. జూనియర్ ప్రచారానికి భారీ స్పందన కూడా వచ్చింది. కానీ, అప్పుడు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఆ తరువాత నుంచి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. మరి ఇప్పుడు  టీడీపీని ఓడించిన వైస్సార్సీపీ ప్రపోసల్ కి జూనియర్ ఎన్టీఆర్ సరే అంటారో లేదో మరి?