ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్

 

కూకట్ పల్లి స్థానం నుంచి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని ఎన్నికల బరిలో దిగనున్నారు.ఈ రోజు నామినేషన్ వేయనున్నారు.ఇప్పటికే బాబాయ్ బాలయ్య ,సుహాసిని ఎన్టీఆర్,హరికృష్ణ లకు నివాళులు అర్పించారు. బాలయ్య దగ్గర ఉండి నామినేషన్ వేయించనున్నారు. అక్క కోసం జూ.ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ ప్రచారం ప్రారంభించారు.అయితే ప్రత్యక్షంగా కాదు సోషల్ మీడియా వేదికగా తమ సోదరి గెలుపులో భాగస్వామ్యం అవ్వమని కోరారు.ట్విట్టర్ లో ప్రకటన విడుదల చేశారు.ప్రకటనలో ‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో మా తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారు. తెదేపా మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్న హరికృష్ణ తెదేపాకు ఎనలేని సేవలందించారు. మా సోదరి సుహాసిని కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. సమాజంలో స్త్రీలు ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం మాది. అదే స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్ధపడుతోన్న మా సోదరికి విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నాం. జై ఎన్టీఆర్‌. జోహార్‌ హరికృష్ణ.’ అని కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌  పేర్కొన్నారు. సోషల్ మీడియాలోనే కాదు ప్రత్యక్ష ప్రచారంలోకూడా వీరిద్దరు భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది.హరికృష్ణ మరణం తర్వాత ఆ కుటుంబానికి అన్నీ తానైన బాలయ్య సుహాసిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం దాదాపు ఖరారైంది.నందమూరి,నారా కుటుంబాలు ఆమె గెలుపుకోసం రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం.