ఆ అర్హత ఉండబట్టే జీవన్ రెడ్డికి తెరాస టికెట్

Publish Date:May 13, 2013

 

విపక్ష పార్టీ నేతలకు ఏప్రిల్ 27లోగా వచ్చి తమ పార్టీలో చేరితే ‘టికెట్స్ గ్యారంటీ’ అంటూ కేసీఆర్ ప్రకటించిన ‘బంపర్ ఆఫర్’ కు దాదాపు నెలరోజులవుతున్నాఇంతవరకు ప్రత్యర్ధి పార్టీ నేతల నుండి ఏమాత్రం స్పందన రాలేదు. ఇక నేడో రేపో వచ్చి తెరాసలో చేరిపోతారనుకొన్నమందా జగన్నాధం, కే.కేశవ్ రావు వంటి కాంగ్రెస్ నేతలు కూడా మొహం చాటేయడంతో, అటువంటి బలమయిన అభ్యర్ధులు ఎంపిక ప్రక్రియకి కేసీఆర్ ఇటీవలే అవసరమయిన ప్రాధమిక అర్హత నిర్దేశించారు.

 

“ఆర్ధికంగా బలంగా ఉండి, ఎన్నికలలో డబ్బు విరివిగా ఖర్చు పెట్టగలవారికి మాత్రమే పార్టీ టికెట్స్” అని విస్పష్టంగా ఆయన ప్రకటించారు. ఆయన ఆవిధంగా బహిరంగంగానే ప్రకటించడంతో తెరాస శ్రేణుల్లో కలకలం చెలరేగింది. ఆయన ఇంతకాలం ఇతర పార్టీల నేతల వెంట ఎందుకు పడుతున్నాడో ఆ ప్రకటన కళ్ళకి కట్టినట్లు చూపించింది. అంతే కాకుండా, కేవలం ఉద్యమాలలో పాల్గొనందునో లేక ఇంతకాలం పార్టీ జెండాలు మోసినందుకో ఎవరికీ పార్టీ టికెట్స్ కేటాయించలేమని, అందుకు ‘ఆ అర్హత’ తప్పని సరి అని స్పష్టం చేసారు. ‘ఆ అర్హతలు’ ఉన్న కాంట్రాక్టర్లు, విద్యా సంస్థల అధిపతులు, పారిశ్రామిక వేత్తలు ఎవరయినా కూడా టికెట్స్ కు అర్హులేనని ఆయన చెప్పకనే చెప్పారు.

 

ఈ నేపద్యంలో గతనెల 27న ఆర్మూరులో పార్టీ 12వ వార్షికోత్సవ మహా సభలను ఘనంగా నిర్వహించిన ఆశన్నగారి జీవన్‌డ్డికి ‘ఆ అర్హతలన్నీ’ ఉండటంతో కేసీఆర్ ఆయన పేరును ఖరారు చేసారు. నిన్న ఆర్మూరులో జీవన్ రెడ్డి ఇంటికి వచ్చిన కేసీఆర్, అక్కడే ఆయనను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. ఆర్మూరు సభకు ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసి సభను విజయవంతం చేసినందుకు కేసీఆర్ ఆయనను అభినందించారు. రాబోయే ఎన్నికలలో ఘన విజయం సాదించాలని ఆయనని కేసీఆర్ ఆశీర్వదించారు. టీఆర్‌ఎస్ ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా తాను కమిటీలో సభ్యుల ఆమోదంతో జీవన్‌డ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లుచెప్పారు.