నెల్లూరు, ప్రకాశంతో కలిపి గ్రేటర్ రాయలసీమ... సంక్రాంతి తర్వాత ఉద్యమం...

జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే రాయలసీమ ప్రజలకు ఆమోదయోగ్యమని అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేసిన జేసీ దివాకర్ రెడ్డి.... ఒకవేళ కేపిటల్ ను తరలించాలని చూస్తే మాత్రం సంక్రాంతి తర్వాత గ్రేటర్ రాయలసీమ ఉద్యమం చేపడతామన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడతామని అన్నారు. కడప రాజధానిగా గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమం చేపడతామంటోన్న జేసీ.... సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. విశాఖపట్నంలో రాజధానిని ఏర్పాటుచేస్తే... ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు మాత్రమే అనుకూలంగా ఉంటుందని, అదే అమరావతి అయితే, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలంగా అందుబాటులో ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాజధాని తరలింపుపై సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్టుగా వ్యవహరించడం మంచిదికాదన్నారు. ఎన్ని కమిటీలు వేసినా ఉపయోగం ఉండదని, అవన్నీ ముఖ్యమంత్రి నిర్ణయానికి అనుకూలంగానే నివేదికలు ఇస్తాయని జేసీ వ్యాఖ్యానించారు. అయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా పరిపాలన చేస్తాడనుకుని వైసీపీకి 151 సీట్లిస్తే.... సీఎం జగన్మోహన్ రెడ్డి.... దాన్ని నిలుపుకోలేకపోతున్నారని అన్నారు.

అయితే, తెలంగాణ ఉద్యమం సమయంలోనూ రాయలసీమ విషయంలో జేసీ దివాకర్ రెడ్డి తనదైన వాదనలు వినిపించారు. మిగతా రాయలసీమ నేతలకు భిన్నంగా అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరారు. కానీ, ఆనాడు జేసీ కోరిక నెరవేరలేదు. మళ్లీ ఇప్పుడు రాజధాని వివాదం నడుస్తున్నవేళ మరోసారి రాయలసీమ వాదాన్ని జేసీ దివాకర్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఉంటే అమరావతి ఉండాలని... లేదంటే... గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలంటూ డిమాండు చేస్తున్నారు.