శైలజానాథ్ కు జేసీ షాక్!

 

కాంగ్రెస్ నుంచి జై సమైక్యాంధ్ర పార్టీకి.. అక్కడి నుంచి తెలుగుదేశంలోకి మారుతున్న మాజీ మంత్రి శైలజానాథ్ కు మరో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి భారీ షాకే ఇచ్చారు! శింగనమల నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేయాలన్న శైలజానాథ్ ఆశలకు ఆదిలోనే జేసీ గండికొట్టారు. శైలజానాథ్‌పై శింగనమలలో ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతోందని.. అది అనంతపురం లోక్‌సభ అభ్యర్థి అయిన తనపై పడుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు జేసీ వివరించారు. శింగనమలలో కాకుండా శైలజానాథ్‌ను మరోప్రాంతంలో బరిలోకి దించితే తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దీంతో శైలూను మడకశిర నుంచి బరిలోకి దించాలని టీడీపీ అధినేత యోచిస్తున్నట్లు సమాచారం. మంత్రిగా ఉన్న సమయంలో శైలజానాథ్ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌గా వ్యవహరించారు. కేంద్రానికి చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటే.. రాష్ట్ర విభజనను ఆపేయించే బాధ్యత తనదంటూ అనేక సందర్భాల్లో సవాలు కూడా చేశారు. విభజన ప్రక్రియ కొనసాగడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు. తనకు సన్నిహతుడైన శైలజానాథ్ కు .. పార్టీ ఉపాధ్యక్ష పదవిని కిరణ్ కట్టబెట్టారు. కానీ.. ఆ పార్టీకి రాజకీయ భవిత లేదని గ్రహించిన శైలజానాథ్, నెమ్మదిగా సైకిలెక్కాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల టీడీపీలో చేరే ముహూర్తం కోసం శైలజానాథ్ సంప్రదించగా.. కొన్నాళ్లు ఆగాలని చంద్రబాబు ఆయనకు సూచించడంలో అంతరార్థం జేసీ మోకాలడ్డటమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. శైలజానాథ్‌ను మడకశిర నుంచి బరిలోకి దించితే ఎలా ఉంటుందని టీడీపీ ముఖ్య నేతలను చంద్రబాబు ఆరా తీస్తున్నారు.