రాహుల్ గాంధీకి తిట్లు, శాపనార్థాలు...

 

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పుణ్యమా అని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ నాశనమైపోయింది. ఇప్పుడు సర్వనాశనం అయ్యే దిశగా వేగంగా దూసుకెళ్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం నాడు గుడ్ ‌బై చెప్పనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామా విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆమె సోనియాగాంధీకి గతంలో రాసిన లేఖలో రాహుల్ గాంధీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఆ లేఖ గురువారం నాడు మీడియాకి లీకైంది. శుక్రవారం మధ్యాహ్నం కూడా మరోసారి రాహుల్ మీద నోరు చేసుకునే అవకాశం వుంది. తను గుడ్ బై చెప్పడానికి కారణం కాంగ్రెస్ పార్టీలో వున్న బ్యాడ్ బాయ్ రాహుల్ గాంధీయే కారణమని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. తాను కేంద్ర మంత్రిగా వున్నప్పుడు రాహుల్ గాంధీ ఎలా చెబితే అలా విన్నప్పటికీ తనను కేబినెట్ నుంచి తొలగించాడని ఆమె మొత్తుకున్నారు. రాహుల్ గాంధీ కార్యాలయంలోనే తనమీద భారీ కుట్ర జరిగిందని ఆమె పేర్కొన్నారు. వివిధ సందర్భాలలో తనను పార్టీ నాయకత్వం వేధించి, వేపుకుని తిన్నదని, దానికి కారణం రాహుల్ గాంధీయేనని ఆమె ఆరోపించారు. తనను అన్యాయంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తప్పించారని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆమె ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.