బీజేపీకి జస్వంత్ సింగ్ షాక్ ట్రీట్మెంట్

 

రాజకీయ పార్టీలకి టికెట్స్ కేటాయింపు సమయంలో అసమ్మతి బెడద సర్వసాధారణమే అయినప్పటికీ, పార్టీలో అగ్రనేతలే తిరుగుబాటు చేస్తే, ఆ బాధ వర్ణనాతీతం. పార్టీలో చెలరేగిన అసమ్మతి కంటే తమ రాజకీయ ప్రత్యర్ధులకు, మీడియాకు జవాబు చెప్పుకోలేక అత్త కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నాన్నట్లు ఉంటుంది పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. పార్టీలో అత్యంత సీనియర్ నేత అయిన జశ్వంత్ సింగ్ కోరిన విధంగా రాజస్థాన్‌లోని బార్మర్ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీపై ఆగ్రహించిన ఆయన ఈరోజు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ కంగు తింది. ఇదే అదునుగా కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్ వంటి వారు బీజేపీపై దాడి చేస్తుంటే, కాంగ్రెస్ అనుకూల మీడియా జస్వంత్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం మొదలు పెట్టేసింది. కానీ, జస్వంత్ సింగ్ తాను స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషాన్ వేసినప్పటికీ, పార్టీని వీడబోనని ప్రకటించారు.

 

జస్వంత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీని బయట నుండి వచ్చిన వారు పూర్తిగా ఆక్రమించేసారని, దానితో పార్టీలో సీనియర్స్ కి కూడా విలువ, గౌరవం లేకుండా పోయిందని, అందుకు తానే ఒక ఉదాహరణ అని మీడియా ముందు వాపోయారు. పార్టీకి భీష్మ పితామహుడు వంటి లాల్ కృష్ణ అద్వానీ భోపాల్ నుండి పోటీ చేయాలని భావిస్తే ఆయనకు అక్కడ టికెట్ నిరాకరించి అహ్మదాబాద్ నుండి టికెట్ కేటాయించారు. అదేవిధంగా పార్టీలో మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ వారణాసి నుండి పోటీ చేద్దామనుకొంటే, నరేంద్ర మోడీ అక్కడ నుండి పోటీ చేయాలని భావించడంతో జోషీని అక్కడి నుండి తప్పించారు. జరుగుతున్న పరిణామాలకి పార్టీలో సీనియర్లు అద్వానీ, సుష్మస్వరాజ్, శత్రుఘన్ సిన్హా వంటి వారు కూడా చాలా బాధపడ్డారు. కానీ, మోడీ అనుకూల వర్గానికి చెందిన అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు పార్టీ శ్రేయస్సు కోసం కొందరు కొన్ని సార్లు త్యాగాలు చేయవలసి ఉంటుందని తమ సీనియర్లకు హితవు పలకడం గమనిస్తే, జస్వంత్ సింగ్ ఆరోపణలు నిజమేనని నమ్మక తప్పదు. జస్వంత్ సింగ్ పార్టీ ప్రతిష్టకి భంగం కలిగిస్తూ నామినేషన్స్ వేసారు గనుక బహుశః నేడో రేపో ఆయనపై పార్టీ బహిష్కరణ వేటు వేసినా వేయవచ్చును.