పవన్ ని లెక్కచేయని రాపాక.. జగన్ కి జై కొట్టి, పక్కన కూర్చొని కబుర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ షాకిచ్చారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఓటు వేయాలని పార్టీ అధ్యక్షుడిగా పవన్ చెప్పినా.. రాపాక ఆయన మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాని ప్రకటించిన రాపాక.. అసెంబ్లీలో కూడా అదే విషయం చెప్పారు. 

అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీ చేసే ప్రతిదానిని వ్యతిరేకించడం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంతా ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందో రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలిసిందని, అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. మూడు రాజధానులకు ఎవరూ వ్యతిరేకంగా లేరని, అందరూ అనుకూలంగానే ఉన్నారని అభిప్రాయపడ్డారు. సీఆర్డీఏ బిల్లు రద్దుకు జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నానని, సీఎం జగన్ ని అభినందిస్తున్నానని అన్నారు.

అంతేకాదు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. అసెంబ్లీలో రాపాక నేరుగా వెళ్లి సీఎం జగన్ పక్కనే కూర్చున్నారు. ఆయనతో కాసేపు ఏదో విషయమై చర్చించారు. తరువాత తన స్థానానికి వెళ్లి కూర్చొన్నారు. మొత్తానికి తన పార్టీ తరఫున ఉన్న ఒక్క ఎమ్మెల్యే పవన్ ని తెగ ఇబ్బంది పెడుతున్నాడనే చెప్పాలి.