పేరుకే జనసేన ఎమ్మెల్యే... వాయిస్ మాత్రం వైసీపీదే... పవన్ మాటను లెక్కచేయని రాపాక... 

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పదేపదే తన బాస్ పవన్ కల్యాణ్ కు షాకిస్తున్నారు. పార్టీ స్టాండ్ కు భిన్నంగా వ్యవహరిస్తూ స్వతంత్రంగా ముందుకెళ్తున్నారు. పవన్ మాట ఒకటైతే... రాపాక వాయిస్ మరోలా ఉంటోంది. పేరుకే జనసేన ఎమ్మెల్యే... కానీ వాయిస్ మాత్రం వైసీపీదే...అన్నట్లుగా రాపాక వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని పవన్ వ్యతిరేకిస్తే... రాపాక సమర్ధించారు. అసెంబ్లీ లోపలా బయటా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతుగా మాట్లాడారు. ఇక, ఇప్పుడు మూడు రాజధానుల అంశంలోనూ పవన్ తో రాపాక విభేదించారు. 

మూడు రాజధానులను పవన్ వ్యతిరేకిస్తుంటే, అందుకు భిన్నంగా రాపాక వ్యవహరిస్తున్నారు. ఒకవేళ, మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహిస్తే అనుకూలంగా ఓటేస్తానని రాపాక వరప్రసాద్ ప్రకటించారు. రాజధాని మార్పు, మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నవేళ... పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ్యవహరించడంపై పవన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ, మూడు రాజధానుల ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తుంటే, రాపాక మాత్రం పార్టీ స్టాండ్ కు భిన్నంగా ప్రవర్తించడంపై జనసేనాని మండిపడుతున్నారు. మరి, రాపాక విషయంలో పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.