మెడ మీద తలకాయలు ఉండవ్..ఆకు రౌడీ, పిచ్చి కుక్క..

పవన్ అంటే ఫైర్. పవన్ అంటే పవర్. పవన్ అంటే తిక్క. లెక్కలేనంత ఆ తిక్కను కెలికితే ఊరుకుంటారా? అరేవో సాంబా అంటూ రెచ్చిపోడూ. అదే జరిగింది. జనసేన అధినేత ఇగోను దెబ్బతీశారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. పీకేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అందరినీ బెదిరించే పవన్ ను బెదిరిస్తే ఆయన ఊరుకుంటారా? ఓ రేంజ్ లో రెచ్చిపోయారు పవన్ కల్యాణ్. ఆకు రౌడీ నుంచి వీధి కుక్క వరకూ.. డైలాగులతో భీమవరం ఎమ్మెల్యేను ఏకిపారేశారు. పీకే వర్సెస్ గ్రంధి శ్రీనివాస్ ఎపిసోడ్ పశ్చిమలో కాక రేపుతోంది.

ఎమ్మెల్యే ఏమన్నారంటే..

పవన్ కళ్యాణ్ మెడ మీద తలకాయలు ఉండవ్ అని హెచ్చరించారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురిలో జనసేన కార్యకర్తలు దళితులపై దాడి చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసి ధ్వంసం చేశారని విమర్శించారు. జనసేన కార్యకర్తలు సంఘ విద్రోహ శక్తులుగా అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. దళితులపై దాడి జరిగిందని తెలిసి వెళ్లిన తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దళితులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతో ఛలో మత్స్యపురికి పిలుపునిస్తామని గ్రంధి శ్రీనివాస్ హెచ్చరించారు. 

పవన్ స్ట్రాంగ్ కౌంటర్..

మెడ మీద తలకాయలు ఉండవ్ అంటే పీకే ఊరుకుంటారా? ఆవేశంతో ఊగిపోరూ. అదే చేశారు పవన్ కల్యాణ్. తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్న శ్రీనివాస్.. ఓ ఆకు రౌడీ, బ్యాంకులను దోచేసిన వ్యక్తి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేస్తే చూస్తూ కూర్చోమని.. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించేంత సంయమనం తమ దగ్గర లేదంటూ ఓ వీడియో ప్రకటనలో వార్నింగ్ ఇచ్చారు జనసేనాని. వైసీపీ ఎమ్మెల్యే ఆగడాలను కట్టడి చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు. లేదంటే శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. దళితలపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు అక్రమంగా బనాయిస్తే... మానవహక్కుల సంఘానికి తాను స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేస్తానన్నారు. దళితులను రక్షించాల్సిన చట్టాన్నే దళితులపై ప్రయోగిస్తున్నారని తప్పుబట్టారు.

వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్న... వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాటలను... జనసేన శ్రేణులు పట్టించుకోవద్దని సూచించారు. ‘వీధిలో కొన్ని కుక్కలు అరుస్తాయి.. కొన్ని పిచ్చికుక్కలు కరుస్తాయి. కరిచినంత మాత్రాన ఆ కుక్కను మనం కరవం కదా. మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ చేస్తాం. వచ్చే వరకు ఆగుతాం. మీకు మాటిస్తున్నాను. మున్సిపాలిటి వ్యాన్ వస్తుంది.. అప్పటి వరకు సంయమనం పాటించండి’ అంటూ పీకే తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్, గ్రంధి శ్రీనివాస్ ల మధ్య డైలాగ్ వార్ పశ్చిమలో రాజకీయ రచ్చ రాజేస్తోంది.