జానాపై కాంగ్రెస్ నేతల కోపం.. దాని మీద కారం జల్లిన జానా

 

తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై అధికార పార్టీ చూపిస్తున్న వైఖరికి.. రైతు ఆత్మహత్యలను అసలు ఏమాత్రం పట్టించుకోవండలేదని కేసీఆర్ పై ప్రతిపక్షాలు మండిపడుతూ.. ఈరోజు బంద్ ను నిర్వహించాయి. రాష్ట్రంలో అన్నిచోట్లా ప్రతిపక్షపార్టీలు బంద్ ను నిర్వహించాయి. అయితే బంద్ సంగతేమో కాని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఒక్క విషయంలో చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఈ బంద్ లో పాల్గొనకపోవడం. ఈ రోజు తెల్లవారుజాము నుండే ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా బంద్ లో పాల్గొన్నారు. కానీ ఈ బంద్ లో జానా ఎక్కడా కనిపించలేదు. నగరంలో చాలామంది కాంగ్రెస్ నేతలు కానీ, బీజేపీ నేతలు, టీడీపీ, వామపక్ష నేతలు చాలా మంది అరెస్ట్ కూడా అయ్యారు. అయితే జానా రాకపై పలు పార్టీనేతలు చర్చించుకున్నా సర్లే అని చెప్పి ఊరుకున్నారు. అయితే అసలే కోపంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు ఆజ్యం పోసినట్టుగా చేశారు జానా. బంద్ నేపథ్యంలో అరెస్ట్ అయిన నేతలను పరామర్శించడానికి వెళ్లిన జానా అక్కడ వారిని చూసి బావున్నారా అని అన్నారంట. అంతే దీనితో కాంగ్రెస్ నేతలకు కోపం నషాళానికి ఎక్కిందట. పైగా తాను అనారోగ్యం కారణంగా బంద్ లో పాల్గొనడానికి రాలేకపోయానని చెప్పారంట. అయితే నేతలు మాత్రం ఆరోగ్యం బాలేకపోతే పరామర్శించడానికి ఎలా వచ్చారని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.