జైరామ్ నోటి దురద కొంచెం ఎక్కువే

 

గత రెండు వారాలుగా రాష్ట్రం మీదనే చక్కర్లు కొడుతున్న కేంద్రమంత్రి జైరామ్ రమేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రజలని, ప్రతిపక్ష పార్టీలనీ చివరికి తన కాంగ్రెస్ పార్టీకి కూడా చిరెత్తిస్తున్నారు. మొన్న తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని ప్రకటించి నాలిక కరుచుకొన్న తరువాత తెరాస మీద అవాకులు చవాకులు వాగి నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరికలు చేయించుకొని వారి చేత తలంటించుకొన్నాక ఆంద్రాకు వచ్చి పడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు రాజమండ్రీలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని అక్కడ తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. దానిని జైరామ్ రమేష్ ఎద్దేవా చేస్తూ ‘శ్మశానంలో పుడుతున్న పార్టీ చివరికి శ్మశానంలోనే కలిసిపోతుందని’ వ్యాక్యానించారు. అప్పుడు పత్రికా విలేఖరులు అభ్యంతరం చెపితే, తన మాటలను అపార్ధం చేసుకోవద్దని రాజమండ్రిలో ఒక కైలాసభూమి ఉందని అందుకే తాను ఆవిధంగా అన్నాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదని సర్ది చెప్పుకొన్నారు. అయితే కిరణ్ కి కుడిభుజంగా వ్యవహరిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకు తీసిపోని విధంగా చాలా ఘాటుగా బదులిచ్చారు. కాంగ్రెస్ అస్తికలను గోదావరిలో కలపడానికే ఆయన పనికట్టుకొని డిల్లీ నుండి వచ్చారని అన్నారు.

 

తెలుగు ప్రజలందరూ పవిత్ర గోదావరి ప్రవహించే రాజమండ్రీని తమ సాంస్కృతిక రాజధానిగా, ఒక పరమ పవిత్ర ప్రాంతంగా, పుణ్యక్షేత్రంగా భావిస్తూ దానితో ఏదో చెప్పలేని ఒక అవినాబావ సంబంధం పెనవెసుకొని ఉంటారు. అందుకే, అనేకమంది రచయితలు, కవులు, కళాకారులు గోదావరి-రాజమండ్రీ గురించి అపురూపంగా వర్ణిస్తారు. తెలుగు సినిమాకు గోదావరికి-రాజమండ్రీకి విడదీయరాని అనుబంధం ఉంది. అటువంటి పట్టణాన్ని జైరామ్ రమేష్ ఒక శ్మశానభూమిగా వర్ణించడం ఆయన మిడిమిడి జ్ఞానానికి, అహంకారానికి అద్దం పడుతోంది.

 

ఆయన ఈవిధంగా మిడిమిడి జ్ఞానంతో నోటికి వచ్చినట్లు మాట్లాడితే, ఇప్పటికే జీవచ్చవంలా కాడి మీద పడుకానున్న కాంగ్రెస్ పార్టీకి ఆయనే శ్రాద్ధ కర్మలు స్వయంగా నిర్వహించి ఉండవల్లి చెప్పినట్లు ఆ గోదాట్లోనే అస్థికలు కలిపి డిల్లీ తిరుగు ప్రయాణం కాకతప్పదు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే ఇటువంటి నేతల వలననే కాంగ్రెస్ పార్టీకి తీవ్రనష్టం కలుగుతోంది.