సీమాంధ్రకి ‘ప్యాకేజీ’ సినిమా

 

 సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీది పూర్తిగా డిఫరెంట్ ఇస్టోరీ. తెలంగాణా తెచ్చామని ఇక్కడ.. ప్యాకేజి ఇచ్చామని అక్కడ.. టముకు వేయమని రాష్ట్రాన్ని విడదీసిన తెల్లదొర జైరాం రమేష్ ను సోనియమ్మ పురమాయించడంతో ఆయన సీమాంధ్రలో రెక్కలు కట్టుకొని వాలిపోయి మన రాజమౌళి డైరెట్రు కంటే బాగా ఎఫెక్టివ్ గా అరచేతిలో వైకుంటం చూపిస్తూ ఊర్లు చుట్టబెట్టేస్తున్నాడు. అయితే ఆయన కంటే ముందే డిల్లీ నుండి ఊడిపడి సీమాంధ్ర మీద కర్చీఫ్ వేసుకొని కూర్చొన్న వెంకయ్య నాయుడు తన ప్రాస బాషలో అలవోకగా కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే, జైరాం రమేష్ కి ఆయన తమను తిడుతున్నాడో లేక పొగుడుతున్నాడో అర్ధం కాక నోరు వెళ్ళబెట్టేసాడు. అది చూసి కంగారు పడిన సోనియమ్మ పార్లమెంటులో విభజనపై చర్చ జరగకుండా చక్కగా మేనేజ్ చేసి, మూజువాణి ఓటింగ్ తో బిల్లుని గట్టేకించిన ఘనుడు కమల్ నాథ్ ని జైరాంకి తోడుగా ఉండమని పురమాయించింది.

 

ఇక తమతో పొత్తులు పెట్టుకునే ధైర్యం ఎవరూ చేయరని గ్రహించిన బొత్సబాబు ఈసారి తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని, ఒంటరిగానే పోటీ చేసి క్లీన్ స్వీప్ చేసేస్తామని ప్రకటించి లౌక్యం ప్రదర్శించాడు. ఆయన కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రం నుండి క్లీన్ స్వీప్ చేసేస్తానని దానర్ధమని గిట్టని వాళ్ళు పెడర్ధాలు తీసి ఒకటే ఇకఇకలు పకపకలు. ఇక్కడ సీమంధ్రలో బొత్స బాబు పార్టీని క్లీన్ స్వీప్ చేసేస్తానని హామీ ఇస్తుంటే, అక్కడ గులాబీ బాసు క్లీన్ స్వీప్ చేసేందుకు కమిట్ అయిపోవడంతో సోనియమ్మకు మా చెడ్డ చిక్కు వచ్చి పడింది పాపం!