అరచేతిలో స్వర్గం చూపిస్తున్న జైరాం రమేష్

 

రాష్ట్ర విభజనతో ఆగ్రహంగా ఉన్నసీమాంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు, రాష్ట్ర విభజనలో ముఖ్యపాత్ర పోషించిన కేంద్రమంత్రి జైరాం రమేష్ నే కాంగ్రెస్ అధిష్టానం ఎంచుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ ఆయనను ఎంచుకొని కాంగ్రెస్ అధిష్టానం చాలా తెలివయిన నిర్ణయమే తీసుకొందని ఆయన నిరూపిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో లక్షలాది ప్రజలు స్వచ్చందంగా రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసినా పట్టించుకొని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఎన్నికలు ముంచుకు వస్తుండటంతో వారిని ప్రసన్నం చేసుకొనేందుకు జైరాం రమేష్ ను సీమాంధ్రలో పర్యటనకు పంపింది.

 

రానున్న పదేళ్ళలో వైజాగ్, విజయవాడలకు మెట్రో రైళ్ళు, ప్రత్యేక రైల్వే డివిజన్ల ఏర్పాటు, వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు, హైకోర్టు, శాసనసభ, సచివాలయం తదితర భవనాల నిర్మాణం, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి పనులు అంటూ కలలో కూడా ఎవరూ ఊహించలేని స్వర్గాన్ని ఆయన అరచేతిలో చూపిస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు.

 

ఆయన చెపుతున్నవన్నీ ఏర్పడితే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ప్రధమ స్థానంలో నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలే కనబడనప్పుడు జైరాం చేస్తున్నవాగ్దానాలకు విలువేమి ఉంటుంది? అవి ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప వేరెందుకు ఉపయోగపడవు. ఒకవేళ ఎన్నికల తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే, తలకు మించిన భారంగా తయారయ్యే కాంగ్రెస్ ప్రకటిస్తున్న ఈ వరాలన్నిటినీ ఎందుకు అమలు చేస్తుంది? ఎలా అమలు చేస్తుంది? ఎంతవరకు అమలు చేస్తుంది? అని ప్రశ్నించుకొంటే సరయిన సమాధానాలు దొరకవు.

 

గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో, రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నపుడు ఇప్పుడు ఆయన చెపుతున్న వాటిలో ఏ ఒక్కటీ చేయాలని కాంగ్రెస్ ఎందుకు భావించలేదు? అవి చేయకుండా కాంగ్రెస్ పార్టీని ఎవరు అడ్డుకొన్నారు? ఇవన్నీ ఇప్పుడే చేయాలని ఎందుకు భావిస్తోంది? అంటే ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచేందుకేనని ఎవరికయినా అర్ధం అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ అదృష్టం బాగుండి ఎన్నికలలో గెలిచినా గత పదేళ్లలలో చేయని పనులు అప్పుడు మాత్రం ఎందుకు చేస్తుంది?  

 

వైజాగ్ కు రైల్వే జోన్ కావాలని, కనీసం ఒకటి రెండు కొత్త రైళ్ళు కావాలని గత పదేళ్లుగా యంపీలు, కేంద్రమంత్రులు కోరుతున్నపటికీ వారి అభ్యర్ధనలను  పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు ఊరికొక మెట్రో రైలుని ఊరకే పంచిపెట్టేస్తామని, జిల్లాకో రైల్వే జోన్ ఇచ్చేస్తానని వాగ్దానం చేయడం హాస్యాస్పదం.

 

ఇంతకాలం సీమాంధ్ర ప్రజలను, వారి ప్రతినిధులను, వారి అభిప్రాయాలను పూచిక పుల్లెత్తు విలువీయని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు సీమాంధ్ర పై ఇంత అవ్యాజమయిన ప్రేమ కురిపించేయడం చాలా ఆహేతుకంగా, అసంబద్దంగా నాటకీయంగా ఉంది. ఈ ప్రేమ, వరాలు అన్నీ కూడా ఎన్నికలలో గెలవడం కోసమే. ఎన్నికలలో గెలిస్తే ఇక మళ్ళీ సీమాంధ్ర ప్రతినిధులు కాంగ్రెస్ అధిష్టానం కాళ్ళ దగ్గర పడి బ్రతకవలసిందే. వారు చెప్పే పోసుకోలు కబుర్లు వింటూ ప్రజలు మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకు ఐదేళ్ళు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడాల్సిందే.