జైపాల్‌కి టీ కాంగ్రెస్ నై!!

 

 

 

ఆలూలేదూ చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అనేది ఓ పాత సామెత. ఆ సామెత తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అతికినట్టు సరిపోతుంది. ఇంకా తెలంగాణ రానేలేదు. తెలంగాణ వస్తుందో రాదో ఇచ్చేస్తున్నాం అని ప్రకటించిన కాంగ్రెస్ వాళ్ళకి కూడా కూడా తెలియడం లేదు. కానీ టీ కాంగ్రెస్ నేతలు మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి పోస్టు గురించి నానా టెన్షన్లూ పడుతున్నారు. కాస్తంత పెద్ద గొంతుతో జై తెలంగాణ అన్న ప్రతి ఒక్క నాయకుడూ నేనే కాబోయే ముఖ్యమంత్రిని అని కలలు కంటున్నారు. అయితే అందరి కలలమీదా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి కడవలకొద్దీ నీళ్ళు కుమ్మరించారు.


‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు జైపాల్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి’’ అనే వార్తలు ఢిల్లీ స్థాయిలో  వినిపిస్తున్నాయి. ఆ వార్తలు చాలామంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో ఆవేదన కలిగిస్తున్నాయి. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు తామంతా తంటాలు పడి తెలంగాణ కోసం నానా హడావిడి చేస్తే ఫలితాన్ని మాత్రం నిన్నగాక మొన్న రంగంలోకి వచ్చిన జైపాల్‌రెడ్డి సొంతం చేసుకుంటున్నారని బాధపడుతున్నారు. స్వతహాగా సమైక్యవాది అయిన జైపాల్‌రెడ్డి మూడు నాలుగు నెలల క్రితం వరకు తాను విభజనవాదినని ఎక్కడా బయటపడలేదు. ఈమధ్యకాలంలోనే ఆయన రాష్ట్రాన్ని విభజించాలనే డిమాండ్ నెత్తికి ఎత్తుకున్నారు. రాజకీయాల్లో సీనియర్ కావచ్చేమోగానీ, తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించడంలో తమకంటే చాలా జూనియర్ అయిన జైపాల్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణ సీఎం సీటును ఎగరేసుకుపోవాలని కోరుకోవడం అన్యాయమని చాలామంది తె.కాం. నాయకులు లోలోపల ఆక్రోశిస్తున్నారు.


తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్న జానారెడ్డి మొదలుకుని షబ్బీర్ అలీ వరకూ అందరూ జైపాల్‌రెడ్డి ఆధిపత్యాన్ని భరించలేకపోతున్నారు. జైపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉండటానికి ఏం చేయడానికైనా సిద్ధంగా వున్నట్టు కనిపిస్తున్నారు. అధిష్ఠానం దగ్గర జైపాల్‌కి నై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. అవసరమైతే తామంతా ఒక్కటై తమలో ఒకరిని ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసి జైపాల్‌రెడ్డికి చెక్ పెట్టడానికి వ్యూహరచన చేస్తున్నారు.