జగ్గారెడ్డి పోటీ చేయరా?

 

 

 

తెలంగాణలో ప్రజా ప్రతినిధులందరూ మాస్ హిస్టీరియా వచ్చినట్టు రాష్ట్రాన్ని విభజించాల్సిందేనని గందరగోళం చేస్తున్న సమయంలో రాష్ట్ర విభజన మంచిది కాదని నినదించిన ఏకైక తెలంగాణ బిడ్డ సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఇప్పటికీ ఆయన రాష్ట్రం విడిపోకూడదని చెబుతూనే వుంటారు. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి విజయం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగ్గారెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.

 

సిద్దిపేట ఉపఎన్నిక సందర్భంగా జగ్గారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మీద నమోదైన కేసు విచారణకు వచ్చింది. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి ఈ ఎన్నికలలో పోటీ చేయడం మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే జగ్గారెడ్డి సతీమణి నిర్మలకు కూడా సంగారెడ్డి ప్రజలతో అనుబంధం వుంది. ఈసారి ఎన్నికలలో నిర్మలను సంగారెడ్డి నుంచి పోటీ చేయించాలని జగ్గారెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం వుంది.