సీఎం కేసీఆర్‌కు 24 గంటలు తాగుడే విజన్

 

జగ్గా రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి నుంచి రుద్రారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ విజన్‌ ఉందని, తెలంగాణ ఆపద్దర్మ సీఎం కేసీఆర్‌కు 24 గంటలు తాగుడే ఆయన విజన్ అని విమర్శించారు. చంద్రబాబుతో టీఆర్‌ఎస్‌ కలిస్తే తప్పు లేదు గానీ, కాంగ్రెస్‌ కలిస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును కేసీఆర్‌ శని అంటున్నారని.. శని అంటే దేవుడు అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఓట్ల కోసం ఆంధ్రులను పొగిడిన కేసీఆర్ ఇప్పుడు తిడుతున్నారని ఆయన విమర్శించారు.

కేసీఆర్ ప్రకటించిన మేనిపెస్టోపై జగ్గారెడ్డి స్పందించారు. అది కేవలం మేనిపెస్టో మాత్రమేనని... అమలయ్యేది కాదని అన్నారు. గత ఎన్నికల్లో ప్రకటించిన మైనారిటీ, గిరిజనులకు రిజర్వేషన్లు, లక్ష రుణమాపీ, లక్ష ఎకరాలకు సాగు నీరు ఏమయ్యాయని ప్రశ్నించారు.ఈ నాలుగేళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలన మహాభారతంలో కౌరవ పాలన మాదిరిగా సాగిందని విమర్శించారు. కేసీఆర్ మరో దృతరాష్ట్రుడు, తెలంగాణ శిశుపాలుడు అంటూ జగ్గారెడ్డి ఎద్దేవా చేశాడు. 

సోనియా గాంధీని బొమ్మ అని విమర్శించిన టీఆర్ఎస్ నేత కేటీఆర్‌ సంగతి ప్రజలే చూస్తారని, తగిన విధంగా బుద్ది చెబుతారని అన్నారు. సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ తీసుకురాలేని దద్దమ్మఅని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పై మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ తీసుకొస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. తాను గెలిచిన ఆరు నెలల్లోగా నియోజకవర్గంలో 40 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని, నియోజకవర్గంలోని ప్రతి డ్వాక్రా గ్రూప్‌కు భవనాలు కట్టిస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.