మోడీ మనసు కరిగించండి.. వైసీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి లేదా?

 

ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కావడానికి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సుమారు 30 నిమిషాలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించారు. 

అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా అమలు, విభజన చట్టంలోని అంశాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అమిత్‌షాను కలిసి లేఖ ఇచ్చాం. హోదా అవసరం ఎంత ఉందో వివరించాం. రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కచ్చితంగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు కావాలని విజ్ఞప్తి చేశాం. రెవెన్యూ లోటుతో సతమతమవుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి తగినరీతిన ఆర్థిక సాయం అందేలా చొరవ చూపాలని కోరాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై ప్రధాని మోదీని ఒప్పించాలని విన్నవించాం. ప్రధాని మనసు కరిగించండి.. మీరు కూడా మంచి సలహా ఇవ్వండని చెప్పాం. దేవుడి దయతో ప్రత్యేక హోదా వచ్చే వరకు ప్రతి సందర్భంలోనూ, ఢిల్లీ వచ్చినప్పుడల్లా కేంద్రాన్ని అడుగుతూనే ఉంటా’’అని జగన్‌ వివరించారు. 

మరోవైపు వైసీపీకి లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని వస్తున్న వార్తలను సీఎం జగన్‌ ఖండించారు. ‘ఎవరూ ఆఫర్‌ చేయలేదు. మేమూ అడగలేదు. అవాస్తవాలు ప్రచారం చేయొద్దు’ అని స్పష్టం చేశారు.