రాజ్యసభకు పిల్లి, మోపిదేవి.! మరో ఏడుగురికి నామినేటెడ్ పదవులు.! మిగతా వాళ్ల పరిస్థితేంటి?

 

శాసనమండలి రద్దు తర్వాత పదవులు కోల్పోనున్న తొమ్మిది మంది వైసీపీ ఎమ్మెల్సీలకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మండలి అధికారికంగా రద్దయిన తర్వాత ఏదో ఒక పదవి కట్టబెడతానని భరోసా కల్పించారు. ముఖ్యంగా శాసనమండలి నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు కీలక పదవులను ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. వైఎస్ కుటుంబానికి నమ్మకస్తులుగా, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా కొనసాగుతోన్న పిల్లి, మోపిదేవికి రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే, మండలి రద్దు తర్వాత పదవులు కోల్పోనున్న మరో ఏడుగురు వైసీపీ ఎమ్మెల్సీలకు కూడా అండగా ఉంటానంటూ జగన్ హామీ ఇచ్చారు. వీళ్లందరికీ నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే, మండలి రద్దుతో పదవులు కోల్పోయేవారికి రాజ్యసభ సభ్యత్వం, నామినేటెడ్ పోస్టులు ఆఫర్ చేసిన జగన్మోహన్ రెడ్డి... ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ హామీలు ఇచ్చినవారికి ఏవిధంగా న్యాయం చేస్తారని చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వివిధ కారణాలతో పలువురికి టికెట్లు నిరాకరించిన జగన్.... అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే, ఇఫ్పుడు ఏకంగా మండలినే రద్దు చేయడంతో... ఇఫ్పుడు వాళ్లందరికీ ఏం సమాధానం చెబుతారని వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇక, ఎమ్మెల్సీ హామీలు పొందిన నేతలైతే మండలి రద్దుపై సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది.