జగన్ ఓదార్పు తెలంగాణా ప్రజలకి అవసరమా?

 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయబోతున్నట్లు ప్రకటించగానే తెలంగాణాను, అక్కడ పార్టీని కూడా వదులుకొని బయటపడిన వైకాపా, సమైక్యాంధ్ర నినాదం అందుకొని సీమాంధ్రపై పట్టుకోసం గట్టిగా కృషి చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం కాకపోయినా సీమాంధ్రపై పట్టు కోసం జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్షలు, ధర్నాలు, సమైక్య సభలు, శంఖారావాలు వగైరా అంటూ చాలానే చేసారు. రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తులు చేసారు. ఆ తరువాత విభజనకు వ్యతిరేఖంగా దేశమంతా పర్యటించి వివిధ పార్టీల నేతలని కలిసారు. కానీ, రాష్ట్ర విభజన జరిగిపోయింది. అయినా తెలంగాణా కాళీ చేసేసి సీమంధ్రకు తరలివచ్చేసిన పార్టీ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని ఇంతగా ఆరాటపడటం విడ్డూరంగా ఉన్నా, సీమాంధ్ర ప్రజల మనోభావనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ అక్కడ గట్టి పట్టు సాధించడానికి చాలానే కష్టపడ్డారు.

 

వెనకటికి ఓ దేవుడెవరో తన భక్తుడితో “నైవేద్యం పెడితే నా మహిమ చూపిస్తానన్నాడుట.” అలాగే ఒకపక్క రాష్ట్ర విభజన ప్రక్రియ చకచకా జరిగిపోతుంటే, జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం చేసుకొంటూ “నాకు ముప్పై యంపీ సీట్లు ఇచ్చి చూడండి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే డిల్లీ కుర్చీలో కూర్చోబెడతానని” చెపుతూ అధికారం కోసమే ఈ తిప్పలన్నీ అనే తన మనసులో మాటను తానే బయటపెట్టుకొన్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది గనుక ముప్పై కాదు ఆయనకు మూడొందల సీట్లు ఇచ్చినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేరనే సంగతి స్పష్టమయింది.

 

అన్ని రకాల సానుభూతి పవనాలు క్రమంగా తగ్గిపోతునపుడు, అందరి దృష్టి ఆకర్షించేందుకు ఏదో ఒక అంశం పట్టుకొని ముందుకు సాగవలసి ఉంటుంది గనుక జగన్మోహన్ రెడ్డి ఈ సమైక్యాంధ్ర నినాదంతో ఇన్ని రోజులు నెట్టుకొచ్చేసారు. ఇక రాష్ట్ర విభజన జరిగిపోయి ఎన్నికలను ఎదుర్కొనే సమయం ఆసన్నమవుతోంది గనుక, అటక మీద పడేసిన తెలంగాణా జెండాలని క్రిందకు దింపి, దుమ్ము దులిపి మళ్ళీ తెలంగాణాలో పార్టీ నేతలను వెతుకొంటూ జగన్ త్వరలో అంటే మార్చి15 నుండి నల్గొండలో ఓదార్పు యాత్రలు చెప్పట్టబోతున్నారు. కానీ తెలంగాణా ఏర్పడినందుకు సంభరాలు చేసుకొంటున్న తెలంగాణా ప్రజలు ఇంకా ఆయన ఓదార్పుని కోరుకొంటున్నారో, లేదో వారే నిర్ణయించుకోవలసి ఉంది.