వ్రతం చెడినా ఫలితం దక్కించుకోలేని వైకాపా

 

జగన్ మోహన్ రెడ్డి తెలంగాణాలో కాలుమోపడానికి కూడా ఇష్టపడని అక్కడి ప్రజలను, కొండ సురేఖ, మహేందర్ రెడ్డి వంటి అనేకమంది తెలంగాణా నేతలు, కార్యకర్తల నిర్విరామ శ్రమఫలితంగా షర్మిల పాదయాత్ర సజావుగా సాగిపోయింది. విజయమ్మ రచ్చబండ కబుర్లనీ తెలంగాణా ప్రజలు ఓపికగా విన్నారు. షర్మిల, విజయమ్మలిరువురూ మండు వేసవిలో ఎంతో శ్రమ పడి తెలంగాణాలో పాదయాత్రలు, రచ్చబండ కార్యక్రమాలు, సభలు నిర్వహించారు. స్వర్గీయ వైయస్సార్ పై అభిమానంతో ఆ పార్టీలో చేరిన వేలాది తెలంగాణా కార్యకర్తలు, వందలాది నేతలు, తెలంగాణా ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో కూడా తెరాసకు ఎదురొడ్డి నిలిచి పార్టీని కాపాడుకొన్నారు. కానీ వారందరి శ్రమంతా కూడా జగన్ మోహన్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేఖంగా తీసుకొన్న ఒకే ఒక నిర్ణయంతో వ్యర్ధమయిపోయింది.

 

అంతేగాక, విస్వసనీయతకు పేటెంట్ హక్కులు తమవేనన్నట్లు మాట్లాడే వైకాపాను ఇప్పుడు తెలంగాణాలో ఎవరూ నమ్మడం లేదు. చివరికి పార్టీకోసం కష్టపడిన నేతలు, కార్యకర్తలు కూడా ఆ పార్టీ తమని నట్టేట ముంచింపోయిందని తిట్టుకొంటూ, ఇక చేసేదేమిలేక మరో కొత్త పార్టీని వెతుకొంటున్నారు. రోజుల గడుస్తున్న కొద్దీ తెలంగాణాలో ఆ పార్టీ కార్యాలయాలు ఒకటొకటిగా మూత పడుతున్నాయి.

 

ఇదంతా ఎందుకు జరిగిందంటే కేవలం పార్టీకి దూరదృష్టి లోపించడం వలనేనని చెప్పవచ్చును. ఆ పార్టీ స్థాపించే నాటికే తెలంగాణా కోసం ఉద్యమాలు తీవ్రంగా సాగుతున్నాయి. అటువంటప్పుడు తమ పార్టీ రాష్ట్ర విభజనపై ఎటువంటి అభిప్రాయం కలిగిఉందో ఆపార్టీకి స్పష్టత కలిగి ఉండి ఉంటే, ఆ పార్టీ తెలంగాణాలో ఇంత శ్రమపడవలసిన అవసరం ఉండేదికాదు.

 

కేవలం ఆంద్ర ప్రాంతానికే తమ పార్టీని పరిమితం చేసుకొని ఉంటే, నేడు హటాత్తుగా సమైక్యరాగం ఎత్తుకోవలసిన అవసరము ఉండేది కాదు. అక్కడి ప్రజలచేత, పార్టీనేతలు, కార్యకర్తలచేత శాపనార్ధాలు పెట్టించుకొనే కష్టం తప్పేది. మొకాలి నొప్పితో షర్మిల పాదయాత్ర చేసే కష్టం, మండే ఎండలలో విజయమ్మ రచ్చబండ కబుర్లు అన్నీతెలంగాణాలో బదులు ఆంద్ర ప్రాంతంలోనే చేసుకొని ఉంటే కనీసం వారి శ్రమకు ఫలితమయినా దక్కి ఉండేది. పైగా ఆంధ్ర ప్రాంతంలో సమైక్యరేసులో అందరికంటే ముందు ఉండగలిగేది.

 

కానీ, వైకాపాకు మొదటినుండి సరయిన రాజకీయ మార్గదర్శనం చేసే సమర్దులయిన నేతలు లేకపోవడం చేతనో లేక ఉన్న వారి సలహాలు సూచనలు పాటించే అలవాటు లేకపోవడం వలనో లేక చంచల్ గూడా జైలు నుండి జగన్ మోహన్ రెడ్డి పార్టీకి శల్యసారధ్యం చేస్తునందునో మొత్తం మీద ఆపార్టీ చాలా అవమానకరంగా మూటాముల్లె సర్దుకొని తెలంగాణా నుండి బయటపడిందని చెప్పవచ్చును. వ్రతం చెడినా ఫలితం దక్కకపోవడం అంటే ఇదేనేమో.