జగన్ బెయిలు పై సుప్రీం కోర్టు తీర్పు నేడే

Publish Date:May 8, 2013

 

జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరు ఈ రోజు కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, మొన్న 6వ తేదీన సుప్రీంకోర్టులో ఆయన బెయిలుపై ఇరువైపుల వాదనలు ముగిసిన అనంతరం తన తీర్పును రిజర్వులోఉంచిన సుప్రీంకోర్టు, నేడు ఆయనకు బెయిల్ మంజూరు చేసేది లేనిదీ ఈరోజు  ప్రకటించబోతోంది. ఆయనకు తప్పక బెయిలు దొరుకుతుందని వారు ధృడంగా నమ్ముతున్నారు.

 

ఒకవేళ ఆయనకు కోర్టు బెయిలు మంజూరు చేసినట్లయితే, రాష్ట్ర రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. ఇంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలా వద్దా? అని ఊగిసలాడుతున్నవారు, ఇక ముందు ఆయన కార్యాలయం ముందు బారులు తీరవచ్చును. అదేవిధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో జరుపాలనుకొంటున్న కార్పోరేషన్, మునిసిపాలిటీ, పంచాయితీ ఎన్నికలపై ఆయన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ఆలోచన విరమించుకొన్నా ఆశ్చర్య పడనవసరం లేదు.

 

ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి బెయిలు రాని పక్షంలో ఆ పార్టీ పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉంటుంది గనుక, ఆయన తన స్థానంలో షర్మిలను నియమించి పార్టీ యొక్క పూర్తి బాధ్యతలు ఆమెకు అప్పగించవచ్చును.