సమైక్యమనగా తెలంగాణాలో కూడా వైకాపా ఉండుట

 

రాజకీయనాయకులూ, పార్టీలు చెప్పే మాటలని సరిగ్గా, పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణా ప్రజలందరూ కూడా తెలుగు భాషపై మరికొంత పట్టు సాధించవలసి ఉంది. ఒక రాజకీయ నాయకుడు, లేదా పార్టీ ఏదయినా ఒక అంశం లేదా పదం పలికితే, దానిని ప్రజలు ఒకలా అర్ధం చేసుకొంటే, నేతలు వేరొకలా భాష్యం చెపుతున్నారు. ఉదారణకి వైకాపా తెలంగాణా సెంటిమెంటుని గౌరవిస్తామంటే, పాపం! తెలంగాణా ప్రజలు తెలంగాణా ఏర్పాటుకి వైకాపాకి అభ్యంతరం లేదని అ(పా)ర్ధం చేసుకొన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా తమకు తెలంగాణాను ఇచ్చేశక్తి, ఆపే శక్తి కూడా లేదని ముక్తాయింపు ఇవ్వడంతో తాము ఈ విషయంలో మాత్రం పొరబడలేదనే భ్రమలో షర్మిలమ్మ పాదయత్రలో పదం కలిపి, విజయమ్మ రచ్చబండ ముచ్చట్లు ఓపికగా విన్నారు. వాళ్ళిరువురూ కూడా రాజన్న రాజ్యం తెస్తామన్నారే తప్ప ఏనాడు తెలంగాణా ఇవ్వొద్దని అనలేదు.

 

కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు ‘సై’ అనడంతో వైకాపా తెలంగాణా నుండి రాత్రికి రాత్రి హై-జంపులు, లాంగు జంపులు చేసుకొంటూ సీమాంధ్రలో వచ్చిపడి ‘సమ న్యాయం’ అంది. సమన్యాయం అంటే వివరించమని ఆ పార్టీకే చెందిన కొండా సురేఖ వంటివారు విజయమ్మను కోరితే, ఆమె సమ న్యాయం అంటే ‘సమైక్యాంధ్ర’ అని వివరించడంతో వైకాపాకి కొండంత అండగా నిలబడ్డ సురేఖమ్మ కూడా కంగుతిన్నారు. అయినా తనకు తెలుగు భాష మీద సరయిన పట్టులేకపోవడం వలననే ఈ ఇబ్బంది అంతా అని గొణుక్కొంటూ ఆమెతో సహా అనేకమంది వైకాపా నుండి శలవు తీసుకొన్నారు.

 

ఆ తరువాత ‘సమైక్యాంధ్ర’కి ‘శంఖారావం’ కూడా జోడించి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు, బస్సు యాత్రలు, దేశ యాత్రలు, దీక్షలు, ధర్నాలు వగైరాలు చేసారు. అయితే ఆయన ఏమి చేసినా, ఏమి మాట్లాడినా కూడా అటు తెలంగాణా ప్రజలు, ఇటు సీమాంధ్ర ప్రజలు కూడా అనుమానంగానే చూస్తున్నారు. కారణం వారెవరికీ తెలుగు భాష మీద సరయిన పట్టులేకపోవడమే. ఆయన తెలంగాణా ఏర్పాటుని అడ్డుకొంటున్నాడని తెలంగాణా ప్రజలు భావిస్తే, ఆయన సమైక్య ముసుగులో రాష్ట్ర విభజన కోసం శ్రమిస్తున్నాడని సీమాంధ్ర ప్రజలు అ(పా)ర్ధం చేసుకొన్నారు తప్ప ఆయన మాటలని, వాటిలో భావాన్ని ఎవరూ సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయారు.

 

ఆయన సమైక్యవాదో, విభజనవాదో ప్రజలకి అర్ధంయ్యేలోగానే రాష్ట్ర విభజన జరిగిపోయింది. అందువలన ఇప్పుడు ఇక ఆ ప్రసక్తి అనవసరం. కానీ, ఇప్పుడు ఆయన మళ్ళీ తెలంగాణాలో ఓదార్పు యాత్రతో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు కమిట్ అయినందున, తనను ఇంతగా అ(పా)ర్ధం చేసుకొన్న తెలంగాణా ప్రజలకు సమైక్యం గురించి కొంచెం బ్రీఫింగ్ ఇవ్వాలని అనుకోవడంతో ఈరోజు మరో రెండు పాత పదాలకు కొత్త అర్ధం చెప్పారు.

 

సమైక్యాంధ్ర, సమైక్యం అంటే అర్దం అన్ని ప్రాంతాల ప్రజలు కూడా తనవారేనని, అన్ని ప్రాంతాలలో ప్రేమ,ఐక్యతలు ఉన్నాయని అర్దమని వివరించారు. అన్ని ప్రాంతాలలో ప్రజలూ తనవాళ్ళే అయినప్పుడు మరి వారి సంక్షేమం కోసం తపించే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కూడా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి శలవిచ్చారు. తన జీవితంలో తన తల్లి, చెల్లి, భార్య అందరూ భాగమే గనుక త్వరలోనే తన ఓదార్పు యాత్రలతో బాటు, షర్మిలమ్మ పాద యాత్రలు, విజయమ్మ రచ్చబండ ముచ్చట్లు కూడా ఉంటాయని ఆయన ప్రకటించారు. గనుక, తెలంగాణా ప్రజలందరూ ఈలోగా తెలుగుభాషపై మరికొంత పట్టు సాధించగలిగితే, వాళ్ళు ముగ్గురూ వద్ద మరికొన్ని సరికొత్త తెలుగు పదాలు, అర్ధాలు నేర్చుకొనే అదృష్టం దక్కుతుంది.