ఇంకెన్నాళ్ళీ జైలు బ్రతుకు?

 

అంతవరకూ భోగభాగ్యాలనే తప్ప జైలు జీవితం కలలోకూడా ఊహించుకొని వై.యస్.జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడా జైల్లో మొట్టమొదటిసారి అడుగుపెడుతున్నపుడు, అతని లాయర్లూ, శ్రేయోభిలాషులూ కూడా ‘మాహా అయితే ఒకట్రొండు నెలలలో మీరు బయటకి వచ్చేస్తారంటూ’ దైర్యం చెప్పి ఆయనని లోపలి సాగనంపక తప్పలేదు. జగన్ కూడా అలాగే అనుకొన్నపటికీ ఆరునెలలు గడిచిపోయినా, ఇంతవరకూ బెయిలు రాలేదు. పైగా వరుసపెట్టి పంపిస్తున్న తన బెయిలు దరఖాస్తులన్నిటినీ క్రింద నుండి పై వరకూ అన్నికోర్టులూ కూడా ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నాయి. తాజాగా హైకోర్టు ఆయన బెయిలు వినతిని వచ్చేనెల నాలుగో తేదీకి వాయిదా వేసింది.

 

ఇది సరిపోనట్లు, మరో వైపు ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్ జగన్ పై దూసేందుకు తమ కత్తులు పదును పెట్టుకొంటున్నట్లు సమాచారం. ఒకవేళ సి.బి.ఐ. కేసుల్లోంచి జగన్ ఎప్పటికయినా బయటపడగలిగినా, ఆ తరువాత తమ విచారణ కార్యక్రమం మొదలుపెట్టే ఆలోచనతో ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్ ఉన్నట్లు సమాచారం. అంటే, జగన్కి ఇప్పట్లో జైలు జీవితం నుండి విముక్తికి అవకాశం లేనట్లే కనిపిస్తోంది. జగన్కి తన పరిస్తితి దాదాపు అర్దమయినందున, నిరాశా నిస్పృహలలో మునిగిపోతున్నట్లు తెలుస్తోంది. అది అసహనంగామారి, తనను కలువవస్తున్న తన ఆత్మీయులపైన, పార్టీ నేతలపైన ఆ కోపం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, గత కొంత కాలంగా అతని కుటుంబ సభ్యులు తప్ప, అతని పార్టీ నేతలెవరూ జైలుకి రావడానికి భయపడుతున్నారని తెలుస్తోంది.

 

ఈ నేపద్యంలో జగన్ తమ లాయర్లను మార్చితే ఏమయినా ప్రయోజనం ఉంటుందా అని అడిగినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా, కేంద్రాన్ని ఒప్పించేందుకు ఏమయినా అవకాశాలు ఉన్నాయా అని కూడా అడిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అడగకపోయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్ది ప్రణబ్ ముఖర్జీగారికే ఓటువేసి కాంగ్రెస్ పార్టీని ప్రసన్నం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు ఏమి ఫలితాన్ని ఈయలేకపోయాయి. పైగా, చాలా స్ట్రిక్టు ఆఫీసరు అని పేరుమోసిన కృష్ణం రాజుని జైళ్ళశాఖ ఐ.జి.గా నియమించి, జైల్లోపల అన్ని చోట్లా సిసి కెమెరాలు పెట్టిన్చినట్లు సమాచారం. తద్వారా, జగన్ని కలవడానికి ఎవరెవరు, ఎన్నిసార్లు వస్తున్నారు, వారేమి మాట్లాడుకొంటున్నారు వంటి ప్రతి చిన్న విషయం కూడా సిసి కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘావర్గాలకి తెలుస్తుండటంతో, ఆ భయంతో పార్టీ వారు జగన్ని కలిసేందుకు వెనకడుగు వేస్తున్నారని ‘ములఖాత్’ రిజిస్టర్ర్ లో నానాటికీ తగ్గుతున్న ఎంట్రీల ద్వారా తెలుస్తోంది.

 

ఇక, నయాన్న విననప్పుడు భయాన్నైన లొంగదీసే ప్రయత్నంలోకొన్ని నెలలక్రితం తన సాక్షి మీడియా ద్వారా సిబి.ఐ. జే.డి. లక్ష్మి నారాయణ యొక్క ఫోన్ కాల్స్ లిస్టు ప్రచురించి లొంగ దీయాలని చూస్తె, అది కాస్తా వికటించి, అయనను మరింత రెచ్చగొట్టినట్లయ్యి, తమ ఉచ్చును తామే బిగించుకొన్నట్లయింది. కోర్టులు కూడా సి.బి.ఐ. అన్ని కేసుల విచారణ ముగించేవరకూ బెయిలుకోసం రాకుండా ఉంటె మంచిది అన్నట్లు సలహా కూడా ఇవ్వడంతో జగన్ ఇప్పడు మరో మూడు, నాలుగు నెలలు చంచల్ గూడా జైల్లో గడిపేందుకు మానసికంగా సిద్దమయినట్లు తెలుస్తోంది.