నా కొడుక్కి బుద్దొచ్చింది

 

తన కొడుక్కి బుద్ధొచ్చిందని ప్రముఖ నటుడు జాకీచాన్ పళ్ళు ఇకిలిస్తూ చెబుతున్నాడు. జాకీచాన్ కొడుకు, సినిమా హీరో జేసీ చాన్ ఆమధ్య డ్రగ్స్ పుచ్చుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఆ కేసులో జేసీ చాన్ ఆరు నెలలపాటు జైలుశిక్ష కూడా అనుభవించాడు. ఆ సమయంలో జాకీచాన్ విలవిలలాడిపోయాడు. జేసీ చాన్ లాంటి పనికిమాలిన కొడుకును కన్నందుకు ఆయన ప్రపంచానికి సారీ చెప్పాడు. జేసీ చాన్ మాత్రం తక్కువ తిన్నాడా... తన తండ్రి జాకీచాన్ తనను సరిగా పెంచకపోవడం వల్లనే తాను డ్రగ్స్‌కి బానిస అయ్యానని, తనను ప్రేమగా పెంచకపోవడం వల్లనే తాను జులాయిగా తయారయ్యానని లేఖ రాశాడు. ‘బొమ్మరిల్లు’ హీరో మాదిరిగా అంతా నాన్నే చేశాడని ఆ లేఖలో మొత్తుకున్నాడు. అయితే ఇప్పుడ జేసీ చాన్ జైల్లోంచి బయటకి వచ్చాడు. ఇప్పుడు జాకీ చాన్ తన కొడుకు గురించి చాలా మురిసిపోతూ చెప్పుకుంటున్నాడు. తన కొడుక్కి జైలుకు వెళ్ళి వచ్చాక బుద్ధి వచ్చిందని అంటున్నాడు. ఇప్పుడు జేసీ చాన్ బుద్ధిగా ఇంట్లోనే వుంటున్నాడట. తన పనులు తానే చేసుకుంటున్నాడట. గతంలో మాదిరిగా జులాయిలా, బద్ధకిస్టులా వుండటం లేదట. తన తల్లికి వంటింట్లో అంట్లు తోముతూ సాయం కూడా చేస్తున్నాడట. జైలు జీవితం జేసీ చాన్‌లో తెచ్చిన మార్పు తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని జాకీ చాన్ చెప్పుకొస్తున్నాడు. అక్కడితే ఆగితే బాగుండేది, జేసీ చాన్‌లో వచ్చిన మార్పు చూసి అతన్ని సంవత్సరానికి ఓసారి జైలుకు పంపిస్తే బాగుండని అనిపిస్తోందని జోకులు కూడా వేశాడు. మొత్తానికి ఈ తండ్రీ కొడుకులు భలేవాళ్ళే!