ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖులపై ఐటీ దాడులు

 

తెలంగాణాలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై జరిగిన ఐటీ దాడులు రాజకీయ దుమారంలేపాయి.తాజా సమాచారం ప్రకారం ఐటీ కన్ను ఆంధ్రప్రదేశ్ పై పడినట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు ప్రముఖులపై ఐటీ దాడులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లపై ఒక్కసారిగా విరుచుకుపడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇందు కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ సిబ్బంది సమాయత్తమవుతున్నట్లు చెబుతున్నారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.అయితే నారాయణ విద్యాసంస్థల్లో ఐటీ దాడులు జరుగుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ మంత్రి పి.నారాయణ తెలిపారు.ఇప్పటివరకు నారాయణ సంస్థలపై ఐటీ దాడులు జరగలేదని స్పష్టం చేశారు. అవన్నీ వదంతులేని కొట్టిపారేశారు.మరోవైపు విజయవాడలోని బెంజి సర్కిల్‌లో గల నారాయణ కాలేజీకి ఈరోజు ఉదయం ఐటీ అధికారులు వెళ్లినట్లు,ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి రికార్డులను సిద్ధం చేసి ఉంచాలని సిబ్బందికి సూచించినట్లు తెలుస్తుంది.ఇప్పటికే నెల్లూరులో తెదేపా నాయకుడు బీద మస్తాన్‌రావు కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు.చెన్నైలోని బీఎంఆర్‌ సంస్థల కార్యాలయాల్లోనూ వారు ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు తెలిసింది.ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఐటీ రాజకీయంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.