రాజకీయ కోణంలోనే ఐటీ దాడులు

 

 

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నా ఐటీ దాడులు సర్వత్రా ఉత్కంఠత రేపుతున్నాయి.వేర్వేరు ప్రాంతాలనుంచి ఆదాయపు పన్ను శాఖకు చెందిన అధికారుల బృందాలు విజయవాడకు చేరుకున్నాయని, ఈ ప్రాంతంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యులే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోదాలు జరిగే అవకాశం ఉందని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం సాగింది.సోదాల సమాచారం ముందే బయటకు వచ్చేయడంతో ఆ బృందాలు ఎక్కడెక్కడకు వెళ్తాయో తెలుసుకునేందుకు  విలేకరులు విజయవాడ ఆటోనగర్‌లో ఉన్న ఆదాయపన్ను శాఖ కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు.వారి దృష్టి మరల్చేందుకు ఐటీ అధికారులు విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని చంద్రబాబు కాలనీలో ఉన్న నారాయణ జూనియర్‌ కళాశాలలోకి వెళ్లారు. అక్కడ ఖాతాలు నిర్వహించే సిబ్బంది ఎన్ని గంటలకు వస్తారంటూ ప్రశ్నించి వెళ్లిపోయారు. దీంతో మంత్రి పి.నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయని ప్రచారం సాగింది.

అయితే తమ విద్యాసంస్థలపై ఎక్కడా సోదాలు జరగలేదని ఆ సంస్థ యాజమాన్యంతో పాటు మంత్రి నారాయణ స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు స్థిరాస్తి సంస్థలు, పరిశ్రమలు, రొయ్యల ఎగుమతి సంస్థలకు చెందిన కార్యాలయాలు, వాటిని నిర్వహిస్తున్నవారు, అందులో పనిచేస్తున్న ముఖ్యమైన ఉద్యోగుల ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు సాగాయి. హైదరాబాద్‌లోని పలు చోట్ల కూడా తనిఖీలు చేశారు.వీటిల్లో పలువురు రాజకీయ ప్రముఖులకు సంబంధించిన సంస్థలూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో తెదేపా ముఖ్య నేత బీద మస్తాన్‌రావుకు చెందిన సంస్థల్లోనూ, ప్రకాశం జిల్లాలో కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన పరిశ్రమల్లోనూ, విశాఖలో  రేవంత్‌రెడ్డి సన్నిహితుడని పేరున్న నంబూరు శంకరరావు సంస్థల కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి.రాజకీయ కోణంలోనే ఐటీ దాడులు జరుగుతున్నాయంటూ విస్తృత ప్రచారం సాగుతోంది.