విజయవాడలో ఐటీ పంజా.. కార్పోరేట్ హాస్పటల్స్ పై మెరుపు దాడులు

దేశవ్యాప్తంగా ఐటీ ఎగవేత దారులపై వరుస దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు ఇవాళ విజయవాడలోని కార్పోరేట్ ఆస్పత్రులే లక్ష్యంగా మెరుపు దాడులు చేపట్టారు. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్న పలు కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో కార్పోరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నగరంలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు పలుచోట్ల ఇవాళ ఐటీ దాడులు కొనసాగాయి. ఇందులో పలు కీలక డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.

రోగుల నుంచి లక్షలాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తన్న కార్పోరేట్ ఆస్పత్రులే లక్ష్యంగా ఇవాళ విజయవాడలో ఐటీ అధికారులు మెరుపు దాడలు చేపట్టారు. ఇందులో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న పలు కార్పోరేట్ ఆస్పత్రులు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్నిరోజులుగా వీరిపై నిఘా పెట్టిన ఐటీ బృందాలు ఇవాళ మెరుపు దాడులకు దిగాయి. దీంతో కార్పోరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఐటీ దాడుల్లో వివిధ ఆస్పత్రులకు సంబంధించిన కీలక ఆధారాలను ఐటీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందులో ఆదాయపన్ను చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో కోట్లాది రూపాయల ఆదాయం చూపుతున్నా పన్ను చెల్లించే సమయానికి తక్కువగా చూపుతున్నట్లు ఐటీ సోదాల్లో తేలింది.

ఇవాళ ఉదయం నుంచి విజయవాడలోని పలు ఆస్పత్రుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఐటీ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఐటీలో ఆదాయాన్ని తక్కువగా చూపుతున్న వారితో పాటు భవిష్యత్తులో రిటర్న్స్ దాఖలు చేయని ఆస్పత్రుల్లోనూ సోదాలు నిర్వహిస్తామని ఐటీ వర్గాలు వెల్లడించాయి.