'ఆపరేషన్ గరుడ'..ఏపీలో ఐటీ దాడులు

 

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.కడప జిల్లాలోని ఆయన స్వగ్రామంతో పాటు హైదరాబాద్ లోని ఇళ్లు, ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఏపీలో ఐటీ దాడులపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఘాటైన విమర్శలు చేశారు.మోదీ ఆపరేషన్ గరుడలో భాగంగానే ఆంధ్రులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని నిలదీసినందుకు ఆంధ్రప్రదేశ్‌పై మోదీ కక్ష గట్టారని విమర్శించారు.మొన్న బీద మస్తాన్‌రావు, నిన్న సుజనాచౌదరి, నేడు సీఎం రమేశ్‌పై ఐటీ దాడులు చేయడం దీనిలో భాగమేనన్నారు.కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్నందుకే రమేశ్‌ను లక్ష్యం చేసుకున్నారని లోకేశ్‌ ఆరోపించారు. కడప ఉక్కు కర్మాగారం కోసం రమేశ్‌ దీక్ష చేపట్టి 100 రోజులు పూర్తయినా కేంద్రంలో చలనం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు రాకుండా చేయాలని దురుద్దేశంతోనే రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు,పరిశ్రమలపై మోదీ దాడులు చేయిస్తున్నారని లోకేశ్‌ దుయ్యబట్టారు.ఎన్ని ఇబ్బందులు పెట్టినా విభజన హామీల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు.ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు.